మండలిలో పెరిగిన టీఆర్‌ఎస్ బలం

26 Jun, 2014 01:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో టీఆర్‌ఎస్ బలం ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం 35 మంది సభ్యులున్న మండలిలో ఇప్పటిదాకా టీఆర్‌ఎస్‌కు ఏడుగురు సభ్యులు ఉండగా... వివిధ పార్టీలకు, సంఘాలకు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్సీలు చేరడంతో ఆ సంఖ్య 16కు చేరింది. దీనితో వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే శాసనమండలి చైర్మన్‌గా కె.స్వామిగౌడ్‌ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్‌కు రాజీనామా చేయాల్సిందిగా సంకేతాలు పంపాలని సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యులకు సూచనలు ఇచ్చారు. టీఎన్జీవోల అధ్యక్షుడిగా ఉన్న స్వామిగౌడ్‌ను ఎమ్మెల్సీగా చేయడంతో పాటు మంత్రివర్గంలోకి తీసుకుని.. ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారాలను అప్పగిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మిగతా ఏడు ఖాళీల్లో గవర్నర్ కోటాలోని ఇద్దరు సభ్యులను (నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్) భర్తీచేశారు.

స్థానిక సంస్థల కోటాలోని ఐదు పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం 35 మంది సభ్యులున్న మండలిలో టీఆర్‌ఎస్‌కు 16 మంది (ఎమ్మెల్సీ కె.దిలీప్ సాంకేతికంగా టీఆర్‌ఎస్ సభ్యుడిగానే వ్యవహరిస్తున్నారు) ఉన్నారు.  కాంగ్రెస్‌కు 12 మంది, టీడీపీకి నలుగురు, ఎంఐఎంకు ఇద్దరు, పీడీఎఫ్‌కు ఒకరు ఉన్నారు. చైర్మన్ నేతి విద్యాసాగర్ గౌరవంగా రాజీనామా చేయకుంటే సంఖ్యాబలం కోసం ఎంఐఎం, పీడీఎఫ్(2+1) మద్దతు తీసుకోవాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు