8 నుంచి అసెంబ్లీ

24 Feb, 2017 03:12 IST|Sakshi
8 నుంచి అసెంబ్లీ

10న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సర్కారు l
 బడ్జెట్‌ రూపకల్పనపై ముఖ్యమంత్రి తుది కసరత్తు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు మార్చి 8న ప్రారంభం కాను న్నాయి. 10న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించా రు. ఈ మేరకు అవసరమైన సన్నాహాలు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశిం చారు. బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున గవర్నర్‌ నరసింహన్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 9న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడతారు. మరుసటి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ కేటాయింపుల కోసం వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఆర్థిక శాఖ ఇప్పటివరకు రూపొందిం చిన బడ్జెట్, ఖరారు చేసిన పద్దులను సీఎం కేసీఆర్‌ గురువారం పరిశీలించారు. దీనిపై ప్రగతి భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణా రావుతో సమీక్షించారు. శాఖల వారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలు, కేటాయింపులపై చర్చించారు.

రేపటి నుంచి మంత్రులతో సమీక్ష
శాఖల వారీగా బడ్జెట్‌ అవసరాలు, ప్రతిపాద నలు, కేటాయింపులపై శనివారం నుంచి సమీక్షించాలని సీఎం నిర్ణయించారు. ఆయా శాఖల్లో ఇప్పటివరకు అమలైన కార్యక్ర మాలు, క్షేత్రస్థాయిలో వాటి పురోగతి.. వచ్చే ఏడాది చేయాలనుకుంటున్న పనులు, కార్యక్రమాలేమిటనే దానితోపాటు పథకాలు, కార్యక్రమాలు, నిధుల వినియోగాన్ని పక్కాగా మదింపు చేసుకుని నివేదిక అందజేయాలని మంత్రులను ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా సమీక్షించి తుది కేటాయింపులు ఖరారు చేస్తామని తెలిపారు. దీంతో మంత్రులందరూ సంబంధిత నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఫోకస్‌!
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్త బడ్జెట్‌ను రూపొందించాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఫోకస్‌ చేయని సామాజిక వర్గాలు, వివిధ కుల వృత్తులకు ప్రయోజనాలు కల్పించే పథకాలకు పెద్దపీట వేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్‌కు ముందే జనహితలో చేనేత, మరమగ్గాల కార్మికులు, ఎంబీసీలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. అంతకు ముందే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులపై అఖిలపక్ష ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ కేటాయింపులు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు.

మరిన్ని వార్తలు