గాంధీ నర్సులకు వేతనాల పెంపు!

13 Jul, 2020 03:00 IST|Sakshi

రూ.25 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులకు త్వరలో వేతనాలు పెరగనున్నాయి. ప్రస్తుతం వారికి ప్రతి నెలా రూ. 17,500 చొప్పున జీతం ఇస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.25వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 212 మంది ఔట్‌సోర్సింగ్‌ నర్సులు పనిచేస్తున్నారు. జీవో 14 ప్రకారం ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ అయిన వీరందరికీ రూ.17,500 జీతం ఇస్తున్నా రు. అయితే ఇటీవల కోవిడ్‌–19 చికిత్స కోసం ని యమితులైన నర్సులకు రూ.25 వేలు చెల్లిస్తున్నా రు. తాము ఎప్పట్నుంచో పనిచేస్తున్నా తక్కువ జీతమివ్వడం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల వైద్య విద్యా సంచాలకుడి కార్యాలయం వద్ద ఔట్‌సోర్సింగ్‌ నర్సులు వరుసగా 3 రోజులు ధర్నా చేశారు. దీంతో డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి వారి జీతాల పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో జీతాలు పెంచాలని ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన జీతాలు ఇన్సెంటివ్‌ రూపంలో ఇచ్చే అవకాశాలు న్నాయి. జీవో 14 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమితులయ్యారు. వారంతా కూడా తమకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేసే అవకాశం ఉండటంతో పెంచిన వేతనాల ను ఇన్సెంటివ్‌ రూపంలో ఇస్తే ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ఇన్సెంటివ్‌గా వేతనంతో పాటు ఇన్‌ పేషెంట్‌ వద్ద సేవలందించే స్టాఫ్‌ నర్సులకు రోజుకు రూ.300–500 మధ్యలో ఇవ్వనున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా సమాచారం రాలేదు. కరోనా విధుల్లో ఉన్నవారికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేస్తున్నారు. వరుసగా 5 రోజులు పనిచేస్తే మరో 5 రోజులు సెలవిస్తున్నారు. ప్రస్తుతం వైరస్‌ భయంతో కొంతమంది నర్సులు విధులకు హాజరుకావడం లేదు. కొంతమంది ఉద్యోగాలకు రాజీనామా కూడా చేశారు. బయట నర్సులకు 12 గంటల డ్యూటీలకే రూ.3–4 వేల వరకు ఇస్తున్నారు. అందుకే కోవిడ్‌ సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలోని ఔట్‌సోర్సింగ్‌ నర్సులకు ఈ మేరకు వేతనాలు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా