బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం: సంజయ్

13 Jul, 2020 02:58 IST|Sakshi

ఎంపీ అరవింద్‌పై దాడిని ఖండించిన బీజేపీ నేతలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విజృంభణ, రైతులు, ప్రజల సమస్యలపై బీజేపీ ఎప్పటికప్పుడు స్పందిస్తోందని, అందుకే సీఎం కేసీఆర్‌కు బీజేపీ అంటే భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. బీజేపీ అంటే భయంతోనే సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమవుతున్నారని, అందుకే టీఆర్‌ఎస్‌ తొత్తులు, చేతగాని దద్దమ్మలు వరంగల్‌లోని తమ పార్టీ కార్యాలయం, అరవింద్‌పై దాడికి పాల్పడ్డారని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకే దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాగా, బండి సంజయ్‌ జూబ్లిహిల్స్‌లోని ఎంపీ అరవింద్‌ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.  

రాష్ట్రంలో రాక్షసపాలన: బీజేపీ నేతలు 
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, అందుకు వరంగల్‌లో బీజేపీ కార్యాలయం, ఎంపీ ధర్మపురి అరవింద్‌పై దాడే నిదర్శనమని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాబూరావు, మాజీమంత్రి డీకే అరుణ అన్నారు. దాడికి కారకులైన వరంగల్‌ ఎమ్మెల్యేలు నరేందర్, వినయభాస్కర్‌లపై వెంటనే కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. తమ పార్టీ ఎంపీపై దాడి పిరికిపందల చర్యని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ఆరోపించారు. ఎంపీపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా