కొలువుల జాతర

2 Jun, 2017 07:30 IST|Sakshi
కొలువుల జాతర

2,437 పోస్టులు..15 నోటిఫికేషన్లు
6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు: టీఎస్‌పీఎస్సీ
గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఫలితాలు విడుదల.. నేడు వెబ్‌సైట్‌లో జాబితాలు
వారంలో గ్రూప్‌–1 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ షురూ.. తరువాత గ్రూప్‌–2కు..
29, 30 తేదీల్లో పీజీటీలకు మెయిన్‌ పరీక్ష.. టీజీటీలకు వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో
  స్పెషల్‌ టీచర్లకు జూలై 30న రాతపరీక్షలు
టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ నిరుద్యోగులకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) శుభవార్త అందించింది. వివిధ కేటగిరీల్లో 2,437 పోస్టులకు సంబంధించి 15 రకాల నోటిఫికేషన్లను గురువారం విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈ నోటిఫికేషన్లు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో (tspsc.gov.in) అందుబాటులో ఉంటాయని తెలిపింది. గురువారం కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి హైదరాబాద్‌లో ఈ వివరాలను వెల్లడించారు. అన్ని కేటగిరీల పోస్టులకు ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ పోస్టుల్లో గురుకుల డిగ్రీ లెక్చరర్లు, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లు, నీటి పారుదల శాఖ, ఆర్‌అండ్‌బీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ తదితర శాఖల్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టులు, ములుగులోని ఫారెస్ట్ కాలేజీలో ప్రొఫెసర్, లైబ్రేరియన్‌ పోస్టులు ఉన్నాయి. గురుకుల డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్, గురుకుల జూనియర్‌ కాలేజీల ఫిజికల్‌ డైరెక్టర్, జూనియర్‌ లెక్చరర్, లైబ్రేరియన్, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్‌ పోస్టులకు స్క్రీనింగ్‌ టెస్టు, మెయిన్‌ పరీక్ష విధానం ఉంటుంది. గురుకుల డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్‌ పోస్టులకు ఇంటర్వూ్య మాత్రమే ఉంటుంది. ఫారెస్టు కాలేజీలో ప్రొఫెసర్స్, లైబ్రేరియన్లను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే ఇంటర్వూ్యల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల చివరి గడువు, పరీక్ష తేదీలను తాత్కాలికంగా నిర్ణయించారు. కచ్చితమైన తేదీలను నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఫలితాలు విడుదల
128 పోస్టుల భర్తీకి నిర్వహించిన 2011 గ్రూప్‌–1.. 1,032 గ్రూప్‌–2 పోస్టుల ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఘంటా చక్రపాణి వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను శుక్రవారం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రూప్‌–1కు 1:2 నిష్పత్తిలో 256 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహిస్తామని, వారంలో వెరిఫికేషన్‌ ప్రారంభమవుతుందని చెప్పారు. అనంతరం గ్రూప్‌–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహిస్తామని, దీనికి 1:3 నిష్పత్తిలో 3,096 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహిస్తామని.. ఇంటర్వూ్యకు మాత్రం 1:2 రేషియోలో అభ్యర్థులను పిలుస్తామని చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థులు చెక్‌ లిస్టులను చూసుకొని ఆయా సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని చక్రపాణి సూచించారు. సర్టిఫికెట్ల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.

మధ్య దళారులను నమ్మొద్దు...
ఇప్పటివరకు వివిధ పోస్టుల నియామకాలను పారదర్శకంగా నిర్వహించామని, భవిష్యత్‌లో మరింత పారదర్శకంగా ప్రక్రియ కొనసాగిస్తామని చక్రపాణి చెప్పారు. మధ్య దళారులు, వదంతులను అభ్యర్థులు నమ్మొద్దన్నారు. నియామకాల కోసం ప్రభుత్వం అప్పగించిన అన్ని ఇండెంట్లు పూర్తి చేశామని, ప్రస్తుతం ఎలాంటి ఇండెంట్లు æపెండింగ్‌లో లేవన్నారు. ఇప్పటికే 6 వేల పోస్టులను భర్తీ చేశామని, 4,432 మంది విధుల్లో చేరారని చెప్పారు. మరో 2 వేల పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతందని, 7,306 గురుకుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని వివరించారు. మొత్తంగా ఇప్పటివరకు 15 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రక్రియ చేపట్టామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన నిబంధనల ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని చక్రపాణి చెప్పారు. ఆ తరువాత విద్యా శాఖ నుంచి జిల్లాల వారీగా పోస్టుల వివరాలతో కూడిన ఇండెంట్లు రావాలని, అవి వచ్చాకే నోటిఫికేషన్‌కు చర్యలు చేపడతామన్నారు. గురుకులాల టీచర్ల, పాఠశాలల టీచర్ల పరీక్ష స్కీం వేరుగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. త్వరలోనే ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు.

29, 30 తేదీల్లో పీజీటీ పోస్టులకు మెయిన్‌ పరీక్షలు
మే 31న రాత పరీక్ష నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) పోస్టుల ‘కీ’లను ఒకటీ రెండు రోజుల్లో విడుదల చేస్తామని, ఫలితాలను వీలైనంత త్వరగా ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ వెల్లడించారు. పీజీటీలకు మెయిన్‌ పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని, టీజీటీలకు వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో నిర్వహించేలా తాత్కాలిక షెడ్యూలు రూపొందించామని చెప్పారు. మొత్తానికి వచ్చే నెల 15 లోగా పరీక్ష నిర్వహిస్తామని, కచ్చితమైన పరీక్ష తేదీల షెడ్యూలును త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అలాగే ఆర్ట్, క్రాఫ్ట్‌ తదితర స్పెషల్‌ టీచర్‌ పోస్టులకు రాత పరీక్షలను వచ్చే నెల 30న నిర్వహిస్తామని వెల్లడించారు.
టీజీటీ, పీజీటీ పోస్టులకు మెయిన్‌ పరీక్ష షెడ్యూలు..
29–6–2017, 30–6–2017: పీజీటీ గణితం, ఫిజికల్‌ సైన్స్, బయలాజికల్‌ సైన్స్, సోషల్‌ స్టడీస్‌
12–7–2017, 13–7–2017: పీజీటీ లాంగ్వేజెస్‌ (తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌)
4–7–2017, 5–7–2017, 6–7–2017: టీజీటీ గణితం, ఫిజికల్‌ సైన్స్, బయలాజికల్‌ సైన్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్‌
14–7–2017, 15–7–2017: టీజీటీ లాంగ్వేజెస్‌ (తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, సంస్కృతం)
30–7–2017: ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్, స్పెషల్‌ టీచర్స్‌ (ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్‌) స్టాఫ్‌ నర్సు పోస్టులకు రాత పరీక్ష

మరిన్ని వార్తలు