ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి..

22 Oct, 2019 12:47 IST|Sakshi

సాక్షి, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడికి దిగారు. దీంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడి నుంచి ప్రయాణికులకు తృటిలో తప్పించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ వెళ్తున్న బస్సుపై చేవెళ్ల సమీపంలో దుండగులు దాడి చేశారు. వికారాబాద్‌ డిపో అధికారులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొనసాగుతున్న నిరసనలు
ఆర్టీసీ కార్మికుల సమ్మె కార్మిక కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ జంపన్న డిపో ముందు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు జంపన్నను అడ్డుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్ మాస్క్‌లు ధరించి ‘సేవ్‌ ఆర్టీసీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చేతులకు సంకెళ్లు వేసుకుని అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు.

హైదరాబాద్ జీడిమెట్ల బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. మహిళా కండక్టర్లంతా కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఈ రోజు ఉదయం బస్సులను ఆపి ప్రైవేట్‌ డ్రైవర్, కండక్టర్‌లకు విధుల్లోకి రావద్దంటూ పూలు ఇచ్చి విజ్ఞప్తి చేశారు. విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ డ్రైవర్, కండక్టర్‌లకు రేపటి నుంచి మీరు విధులకు రావొద్దని, మేము చేసే ఉద్యమానికి మద్దత్తు పలకాలని కోరారు.

మరిన్ని వార్తలు