తుమ్మల, జలగం వర్గాల బాహాబాహీ

28 Mar, 2015 02:00 IST|Sakshi
  • పోటాపోటీగా స్వాగత తోరణాలు
  • తుమ్మల ఫ్లెక్సీలను చింపిన జలగం వర్గీయులు
  • కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ సెక్రటరీ(సీఎంవో) జలగం వెంకటరావు అనుచరుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యూయి. కొత్తగూడెంలో శుక్రవారం జలగం వర్గీయులు తుమ్మల ఫ్లెక్సీలను చింపివేయడంతో వివాదం రాజుకుంది. భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం, మణుగూరులో విద్యుత్ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం సీఎం రోడ్డుమార్గంలో ఖమ్మం నుంచి కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలం రానుండడంతో ఇరువర్గాలకు చెందిన పార్టీ నేతలు పోటాపోటీగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

    అయితే, ఉదయమే మంత్రి తుమ్మల వర్గీయులు పాల్వంచలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చింపారు. ఇది జలగం వర్గీయుల పనేనని మంత్రి వర్గీయులు ఆందోళన చేస్తూ   పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అటు కొత్తగూడెంలోనూ తుమ్మల వర్గీయుల ఫ్లెక్సీలను జలగం వర్గీయులు తొలగించారు. దీంతో తుమ్మల వర్గీయులు మరోమారు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. తిరిగి ఆ ఫ్లెక్సీలనూ జలగం వర్గీయులు చించి వేస్తుండటంతో, అడ్డుకునేందుకు తుమ్మల వర్గీయులు యత్నించారు.

    అనంతరం స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు తుమ్మల వర్గీయులైన కాపా కృష్ణమోహన్‌తోపాటు పలువురు నాయకులు వెళ్లారు. ఆ సమయంలోనే అక్కడికి చేరుకున్న జలగం వర్గీయులు తుమ్మల వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాలు పరస్పర దాడికి పాల్పడ్డారు.  ఈ ఘటనపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఇంటెలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు