రైతన్నకు ఎరువు కష్టం

22 Sep, 2014 01:47 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్, నెట్‌వర్క్: కరువు పరిస్థితుల మధ్య కురిసిన వర్షాలతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న తెలంగాణ రైతన్నకు మరో కష్టం వచ్చి పడింది. సరిగ్గా నాట్లు వేసే సమయంలో తీవ్ర ఎరువుల కొరత అన్నదాతను కన్నీరు పెట్టిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, డీలర్ల తెంపరితనం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచటంలో సర్కారుకు ముందు చూపు కొరవడటం యూరియా కొరతకు కారణమైంది. దీనికితోడు అదనులో ఎరువు తప్పనిసరి కావడాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఒక్కో యూరియా బస్తాపై రూ. 120 వరకు అధికంగా వసూలు చేస్తూ..  పంటలు ఎండిపోయే దశలో వర్షాలు కురవడంతో యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

అయితే రాష్ట్ర విభజన నేపథ్యం.. డిమాండ్‌కు తగ్గ కేటాయింపులు లేకపోవడం.. సీజన్ పూర్తయిపోయిందన్న నిర్లక్ష్యం వెరసి రాష్ట్రంలో యూరియాకు తీవ్ర కొరత ఏర్పడింది. నిబంధనల ప్రకారం జిల్లాలకు వచ్చిన యూరియాలో కనీసం 50 శాతాన్ని సహకార సంఘాలకు కేటాయించాల్సి ఉంది. కానీ అధికారులు ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు డీలర్లకు ఎక్కువ మొత్తం యూరియాను ఇస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించి రూ. 284 ఉండాల్సిన యూరియా బస్తా ధర  రూ. 350 నుంచి రూ. 400 వరకు పెంచేసి రైతులను దోపిడీ చేస్తున్నారు. రవాణా చార్జీల పేరిట ఒక్కో బస్తాపై రూ. 120 వరకూ అధికంగా వసూలు చేస్తున్నారు.
 
 భారీ కొరత..
 
 రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నెల వినియోగం కోసం 1.68 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా.. ఇప్పటివరకు 1.42 లక్షల టన్నులను మాత్రమే వ్యవసాయశాఖ సరఫరా చేయగలిగింది. ఇంకా 25,820 టన్నుల కొరత ఉంది. ఏ జిల్లాలోనూ అవసరమైన మేరకు యూరియా నిల్వలు అందుబాటులో లేవు. దీనికితోడు మరింతగా యూరియాకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ నెలాఖరుకు ఖరీఫ్ ముగుస్తున్న తరుణంలో ఎరువును ఇంకెప్పుడు సరఫరా చేస్తారో తెలియడం లేదు. సరఫరా అయిన యూరియాను కూడా డీలర్లు అక్రమంగా నిల్వ చేసి కొరతను ఇంకా పెంచుతున్నారు. పీఏసీఎస్‌లకు, హాకా సంస్థలకు కేటాయిస్తున్న ఎరువులను వ్యాపారులు రైతుల పేర్లతో దారి మళ్లిస్తున్నారు. వాటిని బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
 
 ఇప్పుడు అత్యవసరం..
 
 తెలంగాణలో 7.53 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. 16.50 లక్షల ఎకరాల్లో పత్తి, 5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వరి ప్రస్తుతం పిలక దశ ముగింపులో ఉండడంతో.. ఇప్పుడు యూరియా చల్లితేనే అధిక దిగుబడి వస్తుంది. ఇక పత్తి, మొక్కజొన్న పంటలకూ ప్రస్తుత దశలో యూరియా అవసరం.
 
 ప్రైవేటు ‘మార్క్’ఫెడ్!
 
 సాధారణంగా మార్క్‌ఫెడ్ నుంచి ప్రాథమిక సహకార సంఘాల ద్వారా వ్యవసాయశాఖ యూరియాను రైతులకు సరఫరా చేస్తుంది. అయితే కొన్ని జిల్లాల్లో సహకార  సంఘాలు మార్క్‌ఫెడ్‌కు బకాయి ఉండటంతో... వాటికి అవసరమైన మేరకు యూరియా సరఫరా చేయడం లేదు. ప్రైవేటు డీలర్లకు మాత్రం ఎక్కువశాతం యూరియాను ఇస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మార్క్‌ఫెడ్‌కు రూ. 8 కోట్లు బకాయిపడ్డాయి. దీంతో అవసరమైన మేరకు యూరియా ఇవ్వడానికి మార్క్‌ఫెడ్ నిరాకరిస్తోంది. దీంతో ఆ జిల్లాలో బ్లాక్‌మార్కెట్లో యూరియా బస్తా రూ. 380 వరకు విక్రయిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవలే వరి నాట్లు వేయడంతో.. డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ వ్యవసాయశాఖ ఒక రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తుండటంతో.. రైతులు బ్లాక్‌మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో బస్తా యూరియాను ఏకంగా రూ. 400కు విక్రయిస్తున్నారు. ఇటీవల జడ్చర్ల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌లలో విజిలెన్స్ దాడులు నిర్వహించింది. జడ్చర్లలో యూరియాను బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముతున్న 6 షాపులను సీజ్ చేశారు. భారీగా యూరియా కొరత తలెత్తడంతో కల్వకుర్తికి వచ్చిన జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ వాహనంపైనా రైతులు దాడి చేయడానికి ప్రయత్నించారు. యూరియా కొరత ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో రైతులు తమ పంటలు కాపాడుకునేందుకు సమీపంలోని మహారాష్ట్రకు వెళ్లి అధిక ధరలకు కొనుగోలు చేసుకుంటున్నారు.
 
 అధికారుల అండదండలు!
 
 యూరియా వంటి ఎరువులతో పాటు విత్తనాలు.. పురుగుమందులు... ఇలా రైతులకు సంబంధించి ఏ అవసరాన్నైనా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధిత ప్రభుత్వాధికారులు కూడా వీలయినంతగా తోడ్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. అధికారుల సహకారంతోనే డీలర్లు, వ్యాపారులు ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించి.. అధిక ధరలకు అమ్ముకుంటున్నారన్న విమర్శలున్నాయి. లెసైన్స్ లేని కంపెనీల ఉత్పత్తులతో పాటు అనుమతి లేకుండా ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు అమ్ముతున్న విషయాలు తనిఖీల్లో వెలుగు చూస్తుం డడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నా యి. ప్రతి ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో ఉండే నిల్వలు, అమ్మకాలపై సంబంధిత ఏడీఏలకు సమాచారం ఉంటుంది. అయినా ఎరువులు, పురుగుమందులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతూనే ఉన్నాయి.
 
 కొరత పెద్దగా లేదు..
 
 రాష్ట్రంలో యూరియా కొరత పెద్దగా లేదని వ్యవసాయ శాఖ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. రోజుకు 6 నుంచి 7 వేల టన్నుల యూరియా అవసరం అవుతుందని... ఇందులో వరి, పత్తికి యూరియా కావాలని, మొక్కజొన్న చివరి దశకు చేరినందున దానికి అవసరం లేదని చెప్పారు. మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో యూరియాకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.
 
 - బి.జనార్దన్‌రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్
 
 ‘బ్లాక్’ చేస్తే లెసైన్స్ రద్దు..
 
 అనివార్య కారణాల వల్ల అక్కడక్కడా యూరియా సరఫరా ఆలస్యమవుతోందని, కొరత లేదని వ్యవసాయ శాఖ (ఎరువుల విభాగం) డిప్యూటీ డెరైక్టర్ కె.రాములు చెప్పారు. ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధరకు యూరియాను విక్రయిస్తే సంబంధిత డీలర్ల లెసైన్సులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. అక్రమంగా దాచిపెట్టినట్లు రుజువైతే వారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని పేర్కొన్నారు. రైతులు తమకు ఫోన్ ద్వారాగానీ, ఎస్‌ఎంఎస్ ద్వారాగానీ ఫిర్యాదు చేస్తే దాడులు చేసి చర్య తీసుకుంటామని చెప్పారు.
 - కె.రాములు, వ్యవసాయశాఖ డిప్యూటీ డెరైక్టర్ (ఎరువుల విభాగం)
 

మరిన్ని వార్తలు