కేసీఆర్ నియంతృత్వాన్ని సహించం: ఉత్తమ్

2 Jul, 2015 01:13 IST|Sakshi
కేసీఆర్ నియంతృత్వాన్ని సహించం: ఉత్తమ్

గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిచ్చి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఈ వైఖరిని సహించబోమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఉపాధి హామీ సిబ్బంది నిర్వహించిన ‘మహాధర్నా’కు వచ్చి న సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆత్మహత్యలు వరుసగా జరుగుతుండటం రైతాంగం దుస్థితిని చాటుతున్నదని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు.
 
 ఉపాధి హామీ సిబ్బంది మహా ధర్నాలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,600 మంది ‘ఉపాధి’ సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఉపాధి సిబ్బంది సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ (సీపీఐ), ఎమ్మెల్యే కిష్టారెడ్డి(కాంగ్రెస్), టీడీపీ అధికార ప్రతినిధి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి,  సీపీఎం నేత మల్లేశం, ఉపాధి హామీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు