మేమేం చేయలేం | Sakshi
Sakshi News home page

మేమేం చేయలేం

Published Thu, Jul 2 2015 1:14 AM

మేమేం చేయలేం

♦ ఐటీ సీజ్ చేసిన రూ.1,274 కోట్ల నిధులపై కేంద్రం నిస్సహాయత
♦ విఫలమైన తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు
♦ పాత బకాయిలపై ప్రతిపాదనలు పంపాలని సూచన
♦ సీఎస్‌టీ, ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని రాష్ర్ట సర్కారు లేఖ

 
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సర్కారు ఖజానా నుంచి ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసిన రూ.1,274 కోట్ల వ్యవహారంపై కేంద్రం చేతులెత్తేసింది. తామేమీ చేయలేమంటూ కేంద్ర ఆర్థిక శాఖ నిస్సహాయతను వ్యక్తం చేసింది. హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సర్కారు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లయింది. ఐటీ శాఖ నుంచి నిధులు తిరిగి ఇప్పించటం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులు, పాత బకాయిలు ఉంటే ప్రతిపాదనలు పంపించాలని సూచించింది. ప్రత్నామ్నాయంగా వాటిని విడుదల చేయిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారుల బృందంతో ఢిల్లీకి వెళ్లి ఈ నిధుల అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. మూడు రోజులుగా అధికారుల స్థాయిలో తన వంతు ప్రయత్నాలు చేసిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర రాష్ట్రానికి తిరిగి వచ్చారు.

 సీఎస్‌టీ బకాయిలపై కేంద్రానికి లేఖ..
 మరోవైపు ఆర్థిక శాఖ సూచనల మేరకు కేంద్రం నుంచి రావాల్సిన పాత బకాయిలు రాబట్టుకునే ప్రయత్నాలను ప్రభుత్వం వేగవంతం చేసింది. తెలంగాణకు రావాల్సిన సీఎస్‌టీ బకాయిలు, 13వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని కోరుతూ బుధవారం కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. గతేడాది డిసెంబర్ నాటికి కేంద్రం నుంచి రూ.6,600 కోట్లు సీఎస్‌టీ బకాయిలు రావాల్సి ఉంది. మొత్తం బకాయిల్లో మూడో వంతు నిధులు మార్చిలో చెల్లిస్తామని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ సమావేశంలో అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ నిధులు రాలేదు. దీనికి తోడు నెలనెలా మరో రూ.250 కోట్లు సీఎస్‌టీ బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం నిధుల్లో మూడో వంతు రూ.2,200 కోట్లు వెంటనే విడుదల చేయాలని లేఖలో ప్రభుత్వం కోరింది.

 ఏడాదిగా కేంద్రం దాటవేత ధోరణి
 రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్‌టీ) బకాయిలపై ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం ఏడాదిగా దాటవేస్తోంది. సీజ్ చేసిన నిధులు ఇప్పించాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బకాయిలకైనా మోక్షం కలుగుతుందేమోనని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. అందుకే సీఎస్‌టీ బకాయిలతో పాటు ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. గత ఆర్థిక సంవత్సరం చివరికి 13వ ఆర్థిక సంఘం గడువు ముగిసింది. ముందుగా నిర్దేశించిన కేటాయింపుల ప్రకారం తెలంగాణకు రావాల్సిన రూ.1,129 కోట్లువిడుదల కాలేదు. ఆర్థిక సంఘం గడువు ముగియటంతో ఇవి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు.

Advertisement
Advertisement