ట్రాఫిక్‌ ఉల్లంఘనులూ జర జాగ్రత్త..!

9 Aug, 2018 08:05 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ ఉల్లంఘనులు ఇక మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే...ఇప్పటికే ట్రాఫిక్‌ జంక్షన్‌లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ  కెమెరాలు,కానిస్టేబుళ్ల చేతుల్లో ఉన్న కెమెరాల చేతికి చిక్కుతున్న వీరు... పోలీసు సిబ్బంది లేరు కదా అని ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడితే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసుకమిషనరేట్లలో ఉత్సవాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో వినియోగించే వెహికల్‌ మౌంటెడ్‌ కెమెరాలను ఇప్పుడూ ట్రాఫిక్‌ ఉల్లంఘనుల భరతం పట్టేం దుకు వాడాలని యోచిస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలు లేని గల్లీల్లో వీటిని వినియోగించాలని భావిస్తున్నారు. ప్ర యోగాత్మకంగా ఐటీ కారిడార్‌లో ఈ వాహనాలను వినియోగించి ఫలితాలను పరి శీలించిన అనంతరం తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నారు.    

360 డిగ్రీల్లో.....
‘ఈ వాహనాల్లో ఉన్న 20 కెమెరాలు ఎప్పటికప్పుడూ ఆయా ప్రాంతాల్లో జరిగే దృశ్యాలను బంధిస్తుంటాయి. పాన్, పింట్, జూమ్‌...అటూ ఇటూ చూడటం...360 డిగ్రీల కోణంలో తిరిగి అన్ని దృశ్యాలను రికార్డు చేస్తాయి. వాహనానికి పక్కన, వెనుక కూడా ఒక్కో కెమెరా ఉంటాయి. వాహనం ఉన్న ప్రాంతం నుంచి చుట్టు పక్కల 500 మీటర్ల మేర ఫొటోలను క్లిక్‌ మనిపిస్తుంది. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించే వారి వాహనాల ఫొటోల ఆధారంగా వాహనదారుడి ఇంటికి ఈ–చలాన్‌ పంపించనున్నారు. ఇప్పటికే వెహికల్‌ మౌంటెడ్‌ కెమెరాలను గణేశ్‌ ఉత్సవాల బందోబస్తు సమయంలో ఉపయోగిస్తున్న వాహనాలను ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు