ఏపీ స్థానంలో టీఎస్!

14 Oct, 2014 01:27 IST|Sakshi
ఏపీ స్థానంలో టీఎస్!

* నంబర్ల మార్పిడిపై ప్రాథమిక నోటిఫికేషన్‌కు సవరణలు చేస్తాం
* వాహనం నంబర్ మార్పు ఉండదు.. హైకోర్టుకు టీ సర్కారు నివేదన
* విచారణ నాలుగు వారాలకు వాయిదా
 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (ఏపీ) పేరుతో ఉన్న వాహనాలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రం (టీఎస్) పేరుతో తిరిగి రిజిస్టర్ చేసుకోవాలన్న ఉత్తర్వులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. నంబర్ల రీ అసైన్‌మెంట్ నిమిత్తం ఈ ఏడాది జూన్ 17న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సవరణలు చేయాలని నిర్ణయించామని తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది.

నంబర్ మార్పు లేకుండా ఏపీ పేరు స్థానంలో టీఎస్ పేరు చేర్చుకునేలా సవరణలు తీసుకువస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అండపల్లి సంజీవ్‌కుమార్ కోర్టుకు తెలిపారు. సవరణల ప్రక్రియుకు నాలుగు వారాల గడువునివ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

వాహనాల నంబర్ల రీ అసైన్‌మెంట్ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన జె.రామ్మోహన్‌చౌదరి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువూర్లు విచారణ జరిగింది. సోవువారం విచారణ ప్రారంభం కాగానే సంజీవ్‌కుమార్ నంబర్ల రీ అసైన్‌మెంట్ నిమిత్తం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌కు సవరణలు చేయాలని నిర్ణయించినట్టు కోర్టుకు నివేదించారు. తదనుగుణంగా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, తుది నిర్ణయం తీసుకుంటామని తెలి పారు.

ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ప్రాథమిక నోటిఫికేషన్‌కు సవరణలు చేసిన తరువాత వాటిని తమ ముందుంచాలని సంజీవ్‌కుమార్‌కు స్పష్టం చేశారు. నోటిఫికేషన్‌కు సవరణలు చేయడం ద్వారా నంబర్ల రీ అసైన్‌మెంట్ జీవో నంబర్ 3ను ఉపసంహరించుకుంటున్నారా? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. జీవోను ఉపసంహరించుకోవడం లేదని, జీవో నంబర్ 3 కింద జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌కు సవరణలు చేయనున్నామని, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న వాహనాలకు నంబర్‌తో నిమిత్తం లేకుండా ఏపీ పేరు స్థానంలో టీఎస్ చేర్చనున్నామని సంజీవ్ కుమార్ తెలిపారు.

>
మరిన్ని వార్తలు