వేంపేటలో భారీ చోరీ

24 May, 2014 02:57 IST|Sakshi

వేంపేట(మెట్‌పల్లి రూరల్), న్యూస్‌లైన్: మండలంలోని వేంపేటలో గురువారం రాత్రి ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. గ్రామ శివారులోని కల్లెడ నర్సయ్య ఇంట్లో సుమారు 25 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.73 వేల నగదు, బైక్ దొంగించారు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. రాత్రి కుటుంబీకులు భార్య గంగు, కూతురు సుజాతతోపాటు అద్దెకు ఉన్న రెండు కుటుంబాలు ఇంటికి తాళాలు వేసి అరుగుపై పడుకున్నారు. యజమాని నర్సయ్య తలగడ కింద ఉన్న తాళం చెవులతో బీరువా తెరిచి అందులోని నగలు, నగదును, వెండిని దొంగిలించారు. మహిళల మెడల్లోంచీ నగలు దోచుకెళ్లారు. నర్సయ్య భార్య గంగు వి రెండు తులాల పుస్తెలతాడు, రెండు తులాల ముత్యాల గుండ్ల పేరు, మూడు తులాల నాను, పెద్ద కూతురు సుజాతకు చెందిన రెండున్నర తులాల పుస్తెల తాడు, తులం పావు ఉంగరం, చిన్న కూతురు రమ నగలూ బీరువాలో దాచారు.

ఐదు తులాల పెద్దగొలుసు, మూడు తులాల నెక్లెస్, అర తులం చెవి కమ్మలు, అరతులం ఉంగరం, రెండు తులాల బంగారు గొలుసు, ఒక్కో గ్రాము బరువు ఉండే 8 బంగారు ఉంగరాలు, తులం పావు చేతి కడియం, రెండు తులాల ఉంగరాలు, నర్సయ్య గల్ఫ్ నుంచి తెచ్చిన అరకిలో వెండి బిల్ల, ఆరు తులాల వెండి కాళ్ల కడియాలు, రూ. 70 వేలతో సహా పరారయ్యారు. ఇదే ఇంటిలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్టకు చెందిన సంతోష్, శ్రీనివాస్(డ్రైవర్లు) అనే అన్నదమ్ముల కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. వీరి సొత్తు కూడా చోరీ అయింది. సంతోష్ యజమానికి చెందిన బైక్‌ను ఎత్తుకెళ్లారు. నర్సయ్యకు రాత్రి 2 గంటలకు మేల్కొని చూసి కేకలు వేశాడు. అప్పటికే దొంగలు పరారయ్యారు. ఇంటి వెనకాల దొంగలు మద్యం సేవించి, బిర్యాని తిన్న ట్లు ఆనవాళ్లు ఉన్నాయి.  కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. క్లూస్ టీం  ఆధారాలు సేకరించినట్లు వివరించారు.
 
 

>
మరిన్ని వార్తలు