రైతు ఆదాయం రెట్టింపు చేయాలి

18 Jan, 2019 01:52 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రైతుల ఆదాయాన్ని 2022 నాటికల్లా రెట్టింపు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగానికి, వనరుల కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హైటెక్స్‌లో గురువారం అగ్రివిజన్‌–2019 సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాగుభూమి, ఉత్పాదకత, సహజవనరులు, రైతుల ఆదాయాలు తగ్గిపోతుండటం, వాతావరణంలో మార్పులు, ఆహారపదార్థాలకు పెరిగిపోతున్న డిమాండ్‌ వంటి ఎన్నో సవాళ్లను వ్యవసాయ రంగం ఎదుర్కొంటోందన్నారు. వీటిని అధిగమించేలా ప్రభుత్వాలు వ్యవసాయరంగంలో నిర్మాణాత్మక మార్పులు చేయాలన్నారు. దేశ జీడీపీలో వ్యవసాయ రంగానిది 18% వాటా ఉందని, దేశంలో 50% మందికి ఉపాధిని అందిస్తోందని చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు, శాస్త్రీయ సమాజం, కృషి విజ్ఞాన్‌ కేంద్రాలు, రైతులు కలసికట్టుగా కృషి చేయాలన్నారు.  

ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలి
రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన వివిధ పథకాలను వినియోగించుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు. రైతులు సాంకేతికతకు చేరువయ్యి నీటిపారుదల సదుపాయాలు, గిడ్డంగులు, శీతల గిడ్డంగులు వంటి వ్యవసాయ మౌలిక సదుపాయాల పెంపకం, కనీస మద్దతుధర పెరుగుదల వంటి వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు కలిస్తే ఎగుమతులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రైతులకు ఆహార శుద్ధిలో అవగాహన ద్వారా వృథాను అరికట్టొచ్చని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని, జాతీయ, ప్రాంతీయ స్థాయిలో ఆహార, పోషకాహార భద్రతతో సహా వ్యవసాయ రంగంలో పెరుగుతున్న సవాళ్ళను అధిగమించాలని కోరారు. రైతు ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన సాయిల్‌ హెల్త్‌ కార్డ్‌ స్కీమ్, ప్రధానమంత్రి క్రిషి సించాయ్‌ యోజన, పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన లాంటి వాటి గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు కృషి చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను అధిగమించే దిశగా వ్యవసాయంలో మార్పులు రావాలని కోరారు.

మరిన్ని వార్తలు