కుంటుపడుతున్న పాలన

26 May, 2016 01:07 IST|Sakshi

18 జీపీలకు ఆరుగురే కార్యదర్శులు
పట్టించుకోని అధికారులు
నియమించాలని ప్రజల వేడుకోలు

 

శాయంపేట: గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి. పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి సారించకపోవడంతో ఉన్న కార్యదర్శులే మిగిలిన గ్రామాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మండలంలో 18 గ్రామపంచాయతీల్లో ఆరుగురే కార్యదర్శులు ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మండలంలో ఏర్పాటుచేసే సమావేశాలకు రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బందే పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఇతర మండలాలతో పోలిస్తే ఇక్కడ పనిచేసే వారికి వారి విధులతో పాటు ఇతరాత్రా పనులు సైతం చేయాల్సి ఉంటుంది. దీంతో వారి విధులకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు.

 

అభివృద్ధికి ఆటంకం...
గ్రామాల్లో అభివృద్ధి చేపట్టాలన్నా.. సమస్యలను పరిష్కరించాలన్నా గ్రామ పంచాయతీకి పన్నుల వసూలు తప్పనిసరి. కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్న సమయంలోనే పన్నులు వసూలు అంతంత మాత్రంగానే ఉంటుంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు సైతం నిలిచేపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో కార్యదర్శులు కొరత లేకుండా చేసి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 

న్యాయం చేయలేకపోతున్నాం
నేను పనిచేసేది తహరాపూర్. అదనంగా సూరంపేట, గోవిందాపూర్, గట్లకానిపర్తి గ్రామాలకు ఇన్‌చార్‌‌జ బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఏ గ్రామానికి సరైన న్యాయం చేయలేకపోతున్నా. మాకు రావల్సిన ఎఫ్‌టీఏ ఇన్‌చార్‌‌జ అలవెన్స్ సైతం అందడం లేదు.     - బైరబోయిన సుధాకర్, తహరాపూర్ పంచాయతీ కార్యదర్శి

 

పనిభారం పెరిగింది
నాకు పోస్టింగ్ ఇచ్చింది నేరేడుపల్లి. కార్యదర్శుల కొరతతో నాకు జోగంపల్లి, కొప్పుల గ్రామాలకు ఇన్‌చార్‌‌జ బాధ్యతలు ఇవ్వడంతో పనిభారం పెరిగి ఏ గ్రామానికి కూడా పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించలేకపోతున్నా.  - రాయకంటి రాజు, నేరేడుపల్లి, పంచాయతీ కార్యదర్శి

 

మరిన్ని వార్తలు