గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులకు డీడీవో అధికారాలు

1 Oct, 2023 05:32 IST|Sakshi

ప్రతిపాదన ఫైలుకు సీఎం జగన్‌ ఆమోదం 

పూర్తి స్థాయి విధివిధానాలతో త్వరలో ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్‌–5 పంచాయతీ కార్యద­ర్శులకు గ్రేడ్‌ 1–4 కేటగిరీల పంచాయతీ కార్యదర్శుల తరహాలోనే గ్రామ పంచాయతీల బిల్లుల తయారీ తదితర అన్ని రకాల డీడీవో అధికారాలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఆయా గ్రామ పంచాయతీ బాధ్యతల్లోనూ కీలకం కానున్నారు. ఈ ప్రతిపాదనల ఫైలుకు సీఎం జగన్‌ ఆమోదించారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుకు ముందుకు ఏపీలోని గ్రామ పంచాయతీల్లో గ్రేడ్‌ 1, 2, 3, 4 కేటగిరీ పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పనిచేస్తుండేవారు.

అప్పట్లో కొన్ని చోట్ల..మూడు నాలుగు పంచాయతీలకు కలిపి ఒకే పంచాయతీ కార్యదర్శి విధులు నిర్వహించేవారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు సమయంలో ప్రతి 2,000 జనాభాకు ఒక గ్రామ సచివాలయాలం చొప్పున ఏర్పాటు చేసి,  గ్రేడ్‌ –5 పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించింది. వీరికి మిగిలిన 4 కేటగిరి పంచాయతీ కార్యదర్శుల తరహా జాబ్‌చార్ట్‌ నిర్థారణ జరిగినప్పటికీ..అప్పట్లో సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు కాలేదన్న కారణాలతో వీరికి డీడీవో అధికారాలను పూర్తిస్థాయిలో అప్పగించ లేదు. సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గ్రేడ్‌ –5 పంచాయతీ కార్యదర్శులకు డీడీవో అధికారాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి పంచాయతీరాజ్‌ శాఖ పూర్తి విధివిధానాలతో త్వరలో ఉత్తర్వులు వెలువరించనుంది.

1. చాలా కాలంగా కోరుతున్న సమస్య 
గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులకు వారి జాబ్‌ చార్ట్‌ ప్రకారం చిన్న పంచాయతీల బాధ్యతలు అప్పగించాలని చాలా కాలంగా కోరుతున్నాం. మా విజ్ఞప్తిని మన్నించి వారికి న్యాయం చేసిన సీఎం జగన్, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్‌కు కృతజ్ఞతలు. 
– కాకర్ల వెంకట రామిరెడ్డి, గౌరవాధ్యక్షుడు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం 

2. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు 
డీడీవో బాధ్యతలు అప్పగించడం ద్వారా గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేసిన సీఎం జగన్‌కి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 
– బత్తుల అంకమ్మరావు, విప్పర్తి నిఖిల్‌ కష్ణ, డాక్టర్‌ బీఆర్‌ కిషోర్‌ (గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం)

3. ధన్యవాదాలు సీఎం సార్‌..
ఒకేసారి 1.34 లక్షల కొత్త సచివాలయాల ఉద్యోగాల నియమాకం చేపట్టడంతో పాటు.. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రతి సమస్యపై అత్యంత సానుకూలంగా స్పందిస్తున్న సీఎం జగన్‌కు ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం. – ఎండీ జానిపాషా, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ 

మరిన్ని వార్తలు