ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ షురూ

28 Mar, 2019 03:47 IST|Sakshi

సీఈఓ రజత్‌కుమార్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఏప్రిల్‌ 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం పొందిన కొత్త ఓటర్లకు ఉచితంగా ఫొటో గుర్తింపు (ఎపిక్‌) కార్డులతో పాటు ఫొటో ఓటరు స్లిప్పులు, ఓటరు గైడుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికి తిరిగి వీటిని ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. గురువారం నాటికి రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పుల పంపిణీ ఉధృతం కానుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ తెలిపారు. ఇంతకు ముందే ఓటరుగా నమోదు చేసుకుని ఎపిక్‌ కార్డులు తీసుకోనివారు సమీపంలోని మీ–సేవ కేంద్రం వద్ద తగిన రుసుం చెల్లించి పొందవచ్చని తెలిపారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్‌ కేంద్రంలో ఓటరు గుర్తింపు నిర్ధారణకు కేవలం ఓటరు స్లిప్పులు చూపితే సరిపోదని, ఓటరు గుర్తింపు కార్డు లేదా ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని చూపాలని తెలిపారు.  

ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులు 
1.పాస్‌పోర్టు 2. డ్రైవింగ్‌ లైసెన్స్‌ 
3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు/పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగుల గుర్తింపు కార్డులు 
4. బ్యాంకులు, పోస్టాఫీస్‌లు ఫొటోతో జారీ చేసిన పాస్‌ పుస్తకాలు 
5. పాన్‌కార్డు 6. ఎన్‌పీఆర్‌ కింద రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జారీ చేసిన స్మార్ట్‌కార్డు 7.ఉపాధి హామీ జాబ్‌ కార్డు 
8. ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్మార్ట్‌కార్డు 
9. ఫొటో జత చేసి ఉన్న పింఛన్‌ పత్రాలు 
10. ఎంపీ/ఎమ్మెల్యే/ఎంఎల్‌సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం 11. ఆధార్‌ కార్డు   

మరిన్ని వార్తలు