మనుగొండలో కుల బహిష్కరణ

11 Feb, 2018 04:45 IST|Sakshi
బహిష్కరణకు గురైన కుటుంబం

దళితుల్లో చిచ్చు రేపిన వీఆర్‌ఏ కొలువు

ఆత్మకూరు(పరకాల): వీఆర్‌ఏ కొలువు విషయంలో నెలకొన్న వివాదం ఓ దళిత కుటుంబం కుల బహిష్కరణకు దారితీసింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన తుప్పరి సమ్మయ్య కొంత కాలంగా కుల పరంగా వీఆర్‌ఏగా విధులు నిర్వర్తి స్తున్నాడు. గతంలో ఏటా అదే కులంలోని ఒకరు ఈ విధులు నిర్వర్తించేవారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎవరు ఆ విధుల్లో ఉంటే వారికే ఆ ఉద్యోగం వచ్చింది. దీంతో వీఆర్‌ఏ ఉద్యోగం విషయమై గొడవలు మొదలయ్యాయి.

సమ్మయ్యతోపాటు అతడి భార్య యశోద, కూతురు పవిత్ర, కుమారుడు ఉదయ్‌శంకర్‌ను సదరు కులం పెద్దలు శనివారం బహిష్కరించారు. వారితో ఎవరైనా మాట్లాడితే రూ.500 జరిమానా విధిస్తామని తీర్మానించారు. ‘తమను హోటళ్లకు కూడా వెళ్లనీయడం లేదు.. కుల పెద్దలు తమను గతం నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. గతంలో తమ చేలను ధ్వంసం చేశారు.. పెళ్లిళ్లు.. చావులకు రానీయడం లేదు.. పొదుపు సంఘం నుంచి తొలగించారు..’అంటూ బాధిత కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
 

మరిన్ని వార్తలు