ఖజానా నుంచి వేతనాలివ్వండి

21 Jun, 2015 03:40 IST|Sakshi

దేవాదాయ కమిటీకి అర్చకులు, ఉద్యోగుల వినతి
సాక్షి, హైదరాబాద్:
తమకు ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలు ఇచ్చేలా సిఫారసు చేయాలని దేవాదాయ చట్ట సవరణకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీకి దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల అర్చకులు, ఉద్యోగులు కోరారు. కమిటీ సభ్యులు వెంకటాచారి, సీతారామారావు, కృష్ణమూర్తి శనివారం దేవాదాయశాఖ కార్యాలయంలో అభిప్రాయసేకరణ నిర్వహించారు. దీనికి పలు ఆలయాల ధర్మకర్తలు, అర్చకులు, ఉద్యోగులు హాజరై పలు సూచనలు అందజేశారు.

దేవాలయాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఖజానా నుంచి వేతనాలు చెల్లించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్‌తో ఇటీవల దేవాలయ అర్చకులు, ఉద్యోగుల జేఏసీ సమ్మెకు దిగటంతో ప్రభుత్వం దాని పరిశీలనకు ఓ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చట్ట సవరణ కమిటీకి కూడా ఆ అంశాన్ని వివరించి ప్రభుత్వానికి అనుకూలంగా సిఫారసు చేయాల్సిందిగా కోరారు.
 
అర్చక సంఘాల విభేదాలపై అసహనం: అర్చక సంఘాల్లో విభేదాలు, పరస్పర ఆరోపణలపై కమిటీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల గంగు భానుమూర్తి ఆధ్వర్యంలోని అర్చక సంఘం, ఉద్యోగుల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంలో అర్చకుల్లో విభేదాలు రచ్చకె క్కాయి. సమ్మెను ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలోని తెలంగాణ అర్చక సంఘం వ్యతిరేకించింది. సమ్మెకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఈ విభేదాలు తీవ్రమయ్యాయి. కమిటీకి మొదట భానుమూర్తి వర్గం సూచనలు అందజేసింది. ఆ తర్వాత ఉపేంద్ర శర్మ వర్గం తెలిపింది. ఈ సందర్భంగా రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. దీనిపై కమిటీ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు