నేడో రేపో..!

16 Mar, 2019 12:25 IST|Sakshi

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన?

వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిపై సస్పెన్స్‌

మహబూబాబాద్‌పై కామ్రేడ్ల కన్ను

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులపై రాజకీయ పార్టీల కసరత్తు తుది దశకు చేరింది. ఒకటి, రెండు రోజుల్లో బరిలో నిలిచే తమ అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశాయి. లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఈ నెల 18న విడుదల కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల నాటికి నామినేషన్‌ వేసే విధంగా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ అన్ని పార్టీల్లో క్‌లైమాక్స్‌కు చేరింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ వరంగల్, మహబూబాబాద్‌ స్థానాల నుంచి ధీటైన అభ్యర్థులనే బరిలో దింపే ప్రయత్నం చేస్తుండగా.. రాష్ట్రంలో నాలుగు స్థానాలను ఎంపిక చేసుకున్న సీపీఐ, సీపీఎం మహబూబాబాద్‌ నుంచి అభ్యర్థిని పోటీలో దింపనున్నట్లు సూచనప్రాయంగా ప్రకటించాయి. 

పసునూరి దయాకర్, సీతక్కల పేర్లు ఫైనల్‌
వరంగల్, మహబూబాబాద్‌ స్థానాలపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల కసరత్తు తుది దశకు చేరింది. ఇక అధికారిక ప్రకటనే తరువాయిగా మారింది. వరంగల్, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల నుంచి టీఆర్‌ఎస్‌కు ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలు పసునూరి దయాకర్, ఆజ్మీరా సీతారాంనాయక్‌ ప్రాతనిధ్యం వహిస్తున్నారు. ఇందులో దయాకర్‌కు దాదాపు టికెట్‌ ఖరారైనట్లే. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి శాసనమండలి చైర్మన్‌గా అవకాశం ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. సీతారాంనాయక్‌ విషయంలో అధిష్టానం ఇంకా ఆలోచన చేస్తున్నా.. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి, రామచంద్రునాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితలలో ఎవరో ఒకరికి టికెట్‌ దక్కుతుందని ఖాయంగా చెప్తున్నారు. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని పేర్కొంటున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ విషయానికొస్తే... ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్కకు మహబూబాబాద్‌ ఎంపీ టికెట్‌ ఖాయమంటున్నారు. ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్లు టీపీసీసీ నుంచి సమాచారం అందుకున్నారు. ఢిల్లీ పెద్దలతోనూ ఆమె మాట్లాడినట్లు అనుచురులు చెప్తున్నారు. ఇదిలా వుంటే అధికారికంగా అభ్యర్థుల ప్రకటన వెలువడకపోవడంతో మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్, పార్టీ సీనియర్‌ నేత బెల్లయ్యనాయక్‌ తదితరులు సీరియస్‌గానే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్‌ సీటు కోసం ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ, అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, సింగాపురం ఇందిర పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో అద్దంకి దయాకర్, మంద కృష్ణ, ఇందిర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

బీజేపీ రాష్ట్రపార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, ఓంటేరు జయపాల్, సినీనటుడు బాబుమోహన్‌తో పాటు ఏడుగురు వరంగల్‌ నుంచి ఆ పార్టీ టికెట్‌ కోరుతున్నారు. మహబూబాబాద్‌ నుంచి హుస్సేన్‌నాయక్, యాప సీతయ్యలతో పాటు ఎనిమిది మంది పోటీ పడుతున్నారు. దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సూచన మేరకు, రాష్ట్రపార్టీ ఎన్నికల కమిటీ, కోర్‌ కమిటీ ఇటీవల సమావేశమై ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ఆశావహుల పేర్లతో ఈ జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. 

నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థుల ప్రకటన
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ముందే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా పార్టీలు 16, 17 తేదీల్లో అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేయనున్నట్లు ప్రకటించాయి. టీఆర్‌ఎస్‌ తరఫున లోక్‌సభకు పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికలో శాసనసభ్యులు కీలకపాత్ర పోషిస్తున్నారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా టికెట్ల ఖరారుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజులుగా కసరత్తు చేసి ఫైనల్‌కు వచ్చారు.

డీసీసీ, టీపీసీసీ పరిశీలన అనంతరం కాంగ్రెస్‌ అభ్యర్థుల ఫైనల్‌ జాబితా మూడు రోజుల కిందటే ఢిల్లీకి చేరింది. ఆ జాబితాపై ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు పూర్తయినట్లు ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు ఒకరు తెలిపారు. అయితే రాహుల్‌గాంధీ శనివారం జాబితాను పరిశీలించే అవకాశం ఉండగా... అదే రోజు సాయంత్రం గాని, ఆ మరుసటి రోజు గాని ప్రకటించవచ్చంటున్నారు. 18న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలై 25 వరకు సాగనుంది. దీంతో అభ్యర్థులు నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచే నామినేషన్లు వేసేందుకు వీలుగా అధికారిక ప్రకటన చేస్తారని ఆశావహులు భావిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు