ఇదరు పిల్లలతో కలిసి అత్తింటి ఎదుట మహిళ ధర్నా..

1 May, 2019 07:34 IST|Sakshi
పిల్లలతో కలిసి ధర్నాకు దిగిన లక్షిత

సనత్‌నగర్‌: తనను ఇంటి నుంచి పంపించి తన భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ గృహిణి తన ఇద్దరి పిల్లలతో కలిసి అత్తింటి ముందు ధర్నాకు దిగింది. సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. కోఠికి చెందిన లక్షితకు సనత్‌నగర్‌కు చెందిన శివకుమార్‌కు 2011 నవంబర్‌ 13న వివాహం జరిగింది. వీరికి లిఖిత, లోహిత్‌ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఓ ప్రైవేటు సంస్థలో శివకుమార్‌ పని చేస్తుంటాడు. వివాహం కొంతకాలానికి భర్త, అత్తింటివారు వేధిస్తుండడంతో లక్షిత పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు భర్తతో పాటు అత్తింటి వారిపై కేసు నమోదయ్యింది.

ఈ క్రమంలో ఇటీవల భార్యాభర్తలు రాజీ పడడంతో కోర్టు ఆదేశాల మేరకు మూడు నెలలుగా కలసి ఉంటున్నారు. అయితే మూడు రోజుల క్రితం వారి మధ్య మళ్లీ ఘర్షణ తలెత్తడంతో లక్షిత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందింది. అయితే ఇంట్లో ఉంటే మళ్లీ ఆత్మహత్యాయత్నం చేసుకుంటుందనే కారణంతో భర్త లక్షితను ఇంట్లోకి రానివ్వక పోవడంతో ఆమె అత్తింటి ముందు మంగళవారం ధర్నాకు దిగింది. భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు ఎక్కువయ్యాయని తనను ఇంట్లో నుంచి పంపించివేసి తన భర్తకు మరో పెళ్లి చేయాలని చూస్తున్నారని లక్షిత ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. లక్షితకు మద్దతుగా ఆమె తల్లిదండ్రులతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు లక్షిత, ఆమె భర్త శివకుమార్‌లను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినప్పటికీ వారి మధ్య సయోధ్య కుదరలేదరు. దీంతో లక్షిత ఫిర్యాదు మేరకు భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు చేస్తామని ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు