విభజిస్తేనే ఆందోళన విరమిస్తాం

24 Feb, 2015 04:37 IST|Sakshi

* హైకోర్టు విభజనకు పట్టుబడుతున్న న్యాయవాదుల సంఘాలు
* విధులు బహిష్కరించి ఆందోళన.. స్తంభించిన కోర్టు కార్యకలాపాలు
 
 సాక్షి, హైదరాబాద్: హైకోర్టును విభజించాలని, ప్రత్యేక బార్ కౌన్సిల్‌ను ఏర్పాటుచేయాలని... అప్పటి వరకు న్యాయవ్యవస్థలో ఎలాంటి నియామకాలు చేపట్టరాదంటూ న్యాయవాదులు చేపట్టిన ఆందోళన తీవ్రమవుతోంది. ఇప్పటికే న్యాయవాదుల విధుల బహిష్కరణతో 20 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కోర్టు విధులు స్తంభించిపోయాయి. ఈ నెల 14న లోక్ అదాలత్‌ను న్యాయవాదులు అడ్డుకున్నారు. ఈ నెలాఖరు వరకు విధులు బహిష్కరించాలంటూ న్యాయవాదుల సంఘాలు నిర్ణయించాయి. హైకోర్టు విభజన జరిగే వరకూ ఆందోళన ఆపేది లేదని మరోవైపు ఆ సంఘాలు హెచ్చరిస్తుండడంతో ఆందోళన సద్దుమణిగేలా కన్పించడం లేదు.
 
 న్యాయవాదులు ఆందోళనకు న్యాయశాఖ ఉద్యోగులూ మద్దతు తెలుపుతున్నారు. హైకోర్టు విభజనలో జాప్యం జరిగితే తాము నిరవధిక సమ్మెకు దిగేందుకూ వెనుకాడమని వీరు ఇప్పటికే ప్రకటించారు. న్యాయవాదుల ఆందోళనలకు అన్ని రాజకీయ పార్టీలు. ప్రజాసంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. హైకోర్టు విభజన జరిగే వరకూ నియామకాలు చేపట్టరాదని తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై అఖిలపక్షం ప్రతినిధులు, బార్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. త్వరలో ప్రధానమంత్రిని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలసేందుకూ అఖిలపక్షం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు