గెలుపోటములకు నాదే బాధ్యత: పొన్నాల

21 Mar, 2014 03:05 IST|Sakshi
గెలుపోటములకు నాదే బాధ్యత: పొన్నాల

 సామాజిక న్యాయానికి పెద్దపీట: పొన్నాల
 కాంగ్రెస్ నేతలంతా టీఆర్‌ఎస్‌తో పొత్తు వద్దనే చెప్పారు
‘బంగారు తెలంగాణ’ కోసమే ఇంకా తలుపులు తెరిచి ఉంచాం

 
 సాక్షి, హైదరాబాద్: 
వచ్చే ఎన్నికల్లో గెలుపోటములకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని, ఆ కోణంలో అంశంపైనే తొలి సంతకం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. సోనియాగాంధీ పట్టుదలవల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందే తప్ప టీఆర్‌ఎస్‌తో కాదని అన్నారు.  క్షేత్రస్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్ నాయకులంతా టీఆర్‌ఎస్‌తో పొత్తు వద్దని ముక్తకంఠంతో చెప్పినా ‘బంగారు తెలంగాణ’ కోసమే కలిసొచ్చే పార్టీలతో పొత్తు కోసం తలుపులు తెరిచి ఉంచామని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ  యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పొన్నాల మాట్లాడారు.
 
 *    తెలంగాణ ఏర్పాటుకు రెండు అంశాలే కారణం. అసువులు బాసిన అమరుల త్యాగాలవల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడితే, ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతోపాటు సోనియాగాంధీ చేసిన కృషివల్లే తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. దేశంలో 27 కొత్త రాష్ట్రాలు కావాలనే డిమాండ్లతో ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాత్రం ఇచ్చింది. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌కు ఇద్దరు సభ్యులే ఉన్నారు. వారిద్దరిమధ్యా సమన్వయం లేదు, ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌వల్లే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని చెబితే ఎవరు నమ్ముతారు?
 
  తెలంగాణ రాష్ట్ర లక్ష్యంతో పార్టీ పెట్టిన వాళ్లు ఇప్పుడు పునర్నిర్మాణం అంటున్నారు. పునర్నిర్మాణం అనే పదానికి అసలైన అర్థమేమిటో మీకు (మీడియా) తెలుసు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో గత పదేళ్లలో మన రాష్ట్రం ఎంతో ముందుంది. జాతీయ సగటు ఆదాయంకంటే 20 శాతం పెరిగింది. ‘బంగారు తెలంగాణ’ సాధించే దిశగా కాంగ్రెస్ ప్రణాళికా బద్ధంగా ముందుకెళుతోంది. 25 ఏళ్ల కోసం ప్రణాళికను రూపొందిస్తున్నాం. 50 వేల ఎకరాల్లో ఐటీఐఆర్ కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా 15.5 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 50 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా రాబోతున్నాయి.
 
 * రాజకీయ లబ్ధి కోసం ఒక పార్టీ పదేపదే రెచ్చగొడుతోంది. తద్వారా రాజకీయ అనిశ్చితి ఏర్పడితే పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు.
  కాంగ్రెస్ నుంచి ఎవరూ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం లేదు. కొండా సురేఖ దంపతులు పార్టీలు తిరిగి వచ్చారు. జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటామని రాసిచ్చారు. వారు కోరిన వెంటనే మున్సిపల్ అభ్యర్థులకు సంబంధించి బి.ఫారాలు వారి చేతికిచ్చాం. ఆ తరువాత గంటకే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు.
 * ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జనాభా ఎక్కడా లేనివిధంగా 87.2 శాతం తెలంగాణలో ఉంది. కచ్చితంగా తెలంగాణ ఏర్పాటు సామాజిక కోణంతో ముడిపడి ఉంది. అధికారంలోకి వస్తే తప్పకుండా సామాజిక న్యాయం దిశగానే చర్యలు తీసుకుంటాం. 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కృషిచేస్తాం.
 * ఉద్యోగుల ఆప్షన్ల విషయంలో తెలంగాణ బిల్లులో పొందుపర్చిన అంశాల మేరకు వ్యవహరిస్తాం. పోలవరం డిజైన్ మార్పు విషయంలోనూ అంతే. బిల్లులో ఆ రెండు అంశాలకు సంబంధించి పరిష్కార మార్గాలున్నాయి. పోలవరం మాదిరిగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరాం.
 * వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు వస్తాయనే నమ్మకం ఉంది.

>
మరిన్ని వార్తలు