నేటి నుంచి ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు

11 Mar, 2018 03:19 IST|Sakshi

అవేర్‌నెస్‌ వాక్‌ను ప్రారంభించనున్న మంత్రి లక్ష్మారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఈనెల 11 నుంచి 17 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అంధత్వ నివారణ సంస్థ, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సంయుక్తంగా వీటిని నిర్వహిస్తున్నాయి. మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆదివారం సరోజినీ ఆస్పత్రిలో అవేర్‌నెస్‌ వాక్‌ని ప్రారంభించనున్నారు. గ్లకోమా (నీటి కాసులు) వ్యాధిపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచేందుకు ఈ వాక్‌ని నిర్వహిస్తున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో వారసత్వంగా గ్లకోమా సంక్రమిస్తుంది. త్వరగా గుర్తిస్తే వైద్య చికిత్స అందించవచ్చు. గ్లకోమాతో కనుగుడ్డు చుట్టూ రంగుల వలయాలు ఏర్పడటం, చూపు మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి.  ప్రపంచవ్యాప్తంగా మూడు శాతం మంది గ్లకోమా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. మన దేశంలో 1.2 కోట్ల మంది ఈ వ్యాధి బాధితులు ఉన్నారు. ఆ మేరకు ప్రపంచంలోని గ్లకోమా వ్యాధిగ్రస్తుల్లో సగం మంది మన దేశంలోనే ఉన్నారు.  

సరోజినీలో ఏటా 10 వేల మందికి వైద్యం 
సరోజినీ దేవి ఆస్పత్రి ఏటా 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తోంది. అందులో సగటున 600 మందికి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కలిగించడం, వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించడం, క్రమం తప్పకుండా చికిత్స చేయించుకుంటే గ్లకోమా నుంచి తప్పించుకోవచ్చు. సరోజినీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రజా చైతన్యం, ర్యాలీలు, సెమినార్లు, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, స్లోగన్స్, పోస్టర్ల పోటీ నిర్వహిస్తు న్నారు. ఈ వారం రోజులు గ్లకోమా నిర్ధారణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీందర్‌గౌడ్‌ తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాల్ని వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు