రంగులు, సున్నాల జాడేలేదు 

7 Feb, 2019 01:29 IST|Sakshi

పందిళ్ల ఊసు అసలే లేదు 

కానరాని పాతగుట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు 

ఎవరికీ తెలియకుండానే ఉత్సవాల  వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ  

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధీనంలోని పాతగుట్ట బ్రహ్మోత్సవాల సమయం దగ్గర పడుతోంది. కానీ వాటి ఏర్పాట్ల ఊసే కనిపించడం లేదు. ఆలయంలో ఈనెల 11 నుంచి అధ్యయనోత్సవాలు, 15 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏడాది 10రోజుల ముందు నుంచి రంగులు, సున్నాలు. జాజులు అద్దేవారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేసేవారు. కానీ ఈ సారి ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. గత ఏడాది ఈపాటికే ఆలయంలో హోమగుండాలు నిర్మించి విగ్రహాలకు పాలిషింగ్‌ చేసి కరపత్రాలను ఊరూరా పంచారు. ప్రతిసారీ అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు కలిపి 15 మంది రుత్వికులకు వారం పది రోజుల ముందే ఆహ్వానాలు పంపేవారు.

అయితే ఈసారి ఈ రోజు వరకూ ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని అధికారులు చెబుతున్నారు.« ధ్వజస్తంభం, స్వామి అమ్మవార్ల వాహనాలకు పాలిషింగ్‌ చేసేవారు. ప్రస్తుతం ఇటువంటి ఆనవాళ్లు కనిపించడంలేదు. యాదాద్రి కొండపైన నిర్మాణ పనుల్లో భాగంగా అన్ని కార్యాలయాలు తొలగిస్తున్న కారణంగా అక్కడి కార్యాలయాలను కొన్నింటిని కొండ కిందికి, మరికొన్నింటిని పాతగుట్టకు మార్చాల్సి ఉంటుంది. దీంతో పాతగుట్ట బ్రహ్మోత్సవాలకు ఎక్కువమంది భక్తులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ పాతగుట్టలో అధికారుల జాడే లేకుండా పోయింది. గతంలో వాల్‌పోస్టర్లను అందరి సమక్షంలో ఆవిష్కరించారు. ఈసారి ఎవరికీ తెలియకుండా వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించినట్లు అధికారులే చెబుతున్నారు. మొత్తానికి పాతగుట్ట ఉత్సవాల సందడే లేకుండా పోయింది.   

మరిన్ని వార్తలు