3 స్టేట్స్‌..

20 Mar, 2019 09:38 IST|Sakshi
ఫొటోలు: శివప్రసాద్‌

తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర..

3 రాష్ట్రాల సాంస్కృతిక సమ్మేళనం జహీరాబాద్‌

రాష్ట్రంలోని ఏ పార్లమెంట్‌ నియోజకవర్గానికి లేని విధంగా విభిన్న సంçస్కృతులు, ఆచారాలు, వ్యవహారాలు, భాషల సమ్మిళితం జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సరిహద్దుగా కర్ణాటక, మహారాష్ట్ర ఉండడంతో ఆయా రాష్ట్రాల ఆచార వ్యవహారాలు ఈ ప్రాంతం పరిధిలో మిళితమై ఉన్నాయి. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గాలకు కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి. జుక్కల్‌ నియోజకవర్గానికి మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. దీంతో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గాల్లో కన్నడ భాష మాట్లాడే వారు అధికంగా ఉన్నారు. పలు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలను కూడా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గం మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంది. దీంతో జుక్కల్‌లో మరాఠీ భాషను మాట్లాడే వారు అధికంగా ఉన్నారు. సరిహద్దులో ఉన్న గ్రామాల్లో మరాఠీ భాష పాఠశాలలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక కామారెడ్డి నియోజకవర్గంలో కరీంనగర్‌ యాసతో కూడిన భాషను మాట్లాడతారు. బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రం ఆంధ్ర యాసలో మాట్లాడే కోస్తాంధ్రా వారూ ఉన్నారు.

ఆచారాలు అనేకం..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, లింగాల మండలాల్లో గిరిజనులు అధికం. ఆయా మండలాల్లో లంబాడీ భాషను అధికంగా మాట్లాడతారు. గాంధారిలో మథురాల తెగ కూడా ఉంది. ఈ ప్రాంతాల్లో గిరిజన సంస్కృతి ఎక్కువ. అంతేకాక జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో అధికంగా లింగాయత్‌ సామాజిక వర్గం వారు ఉన్నారు. దీంతో బసవేశ్వరుడి ఆచార వ్యవహారాలు అధికంగా ఉంటాయి. ముస్లిం మైనార్టీలు సైతం జహీరాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో చెరకు, వరి, అల్లం, ఆలుగడ్డ, జొన్న, కంది, మినుము, పెసర, పత్తి, గోధుమ తదితర పంటలను ప్రధానంగా సాగు చేస్తారు.

జీవన వైవిధ్యం..
జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్‌ ప్రాంతాల్లో తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఆచార వ్యవహారాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కట్టూబొట్టూ దగ్గరి నుంచి సంస్కృతీ సంప్రదాయాల వరకు అన్నింటా ఇక్కడ జీవన వైవిధ్యం కనిపిస్తుంది. జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం 2008లో ఆవిర్భవించింది. దీనికి ముందు జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, అందోల్‌ నియోజకవర్గాలు మెదక్‌ లోక్‌సభ పరిధిలో ఉండేవి. జహీరాబాద్‌ లోక్‌సభ ఆవిర్భావంతో జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, అందోల్‌తో పాటుగా ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాలు ఈ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. జహీరాబాద్‌ ప్రాంతంపై బీదర్‌ ప్రభావమూ ఎక్కువ ఉంటుంది. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్‌ ప్రాంతాల వారు ఎక్కువగా పనులపై కర్ణాటక, మహారాష్ట్రలోని పట్టణాలకే వెళ్లి వస్తుంటారు. నారాయణ్‌ఖేడ్‌లో మహారాష్ట్ర సంప్రదాయాలు అధికంగా కనిపిస్తాయి. ఇక్కడ గల పండరి భక్తులు వేల మంది ఏటా పండరినాథుని దర్శనానికి కాలినడకన ‘దండుయాత్ర’గా మహారాష్ట్రలో గల పండరి క్షేత్రానికి వెళ్తుంటారు. ఆధ్యాత్మిక పాలు కూడా ఈ ప్రాంతాల ప్రజల్లో ఎక్కువ. నిత్యం సప్తాహాలు, భజనలు వంటివి జరుగుతుంటాయి. ఇక్కడ కనిపించే ప్రతి పది మందిలో ముగ్గురు నలుగురు తలపై టోపీలతో మహారాష్ట్ర ఆచార వ్యవహారాలను తలపిస్తారు....::: దివాకర్‌ రెడ్డి కొలన్, సంగారెడ్డి

మరిన్ని వార్తలు