‘పరిషత్‌’ ఆఫీసులెక్కడ?

6 Jun, 2019 07:57 IST|Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెలువడ్డాయి. మండలానికో జెడ్పీటీసీ, ఆయా మండలాల పరిధిలో ఉన్న స్థానాలను బట్టి ఎంపీటీసీ సభ్యులు కొత్తగా ఎన్నికయ్యారు. ఈనెల 7న మండల పరిషత్‌ అధ్యక్షుడితోపాటు వైస్‌ఎంపీపీ, కో–ఆప్షన్‌ సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు. దీనికి ముందు కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇది వరకే షెడ్యూల్‌ జారీ చేసింది. ఇందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 4 వరకు ఉంది.

ఆ లగా నూతన మండల పరిషత్‌లను ఏర్పాటు   చేస్తారా? లేక పాత మండలాల్లోనే కొనసాగిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. కొత్త పాలకవర్గం కొలువుదీరి వారి వారి మండల పరిషత్‌ కార్యాలయాల్లో పాలన సాగించాలంటే నూతన పరిషత్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, ఎంపీటీసీలు జూలై 5న ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారని ఆయా మండలాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నూతన రెవెన్యూ మండలాలను పరిషత్‌ మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాదేశిక ఎన్నికలకు ముందే జిల్లా అధికారులను ఆదేశించింది. దీనిపై అధికారులు అప్పట్లో ఎంపీపీ 
కార్యాలయాల కోసం అద్దె భవనాలు, సౌకర్యాలు ఉండి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. ఉనికిలోకి నూతన మండల పరిషత్‌లు.

జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి. ఇందులో పాత మండలాలు 13 ఉండగా, పునర్విభజన సమయంలో కొత్తగా నాలుగు మండలాలు ఏర్పాటయ్యాయి. జైనథ్, బేల, తలమడుగు, గుడిహత్నూర్, నేరడిగొండ, బజార్‌హత్నూర్, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, తాంసి, ఆదిలాబాద్, ఇచ్చోడ, నార్నూర్‌ మండలాలు ఉండగా, తాంసి పరిధిలోని భీంపూర్‌ కొత్త మండలంగా ఏర్పాటైంది. ఇలాగే ఆదిలాబాద్‌ నుంచి మావల, ఇచ్చోడ నుంచి సిరికొండ, నార్నూర్‌ నుంచి గాదిగూడ మండలాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. నూతన మండలాలు ఏర్పాటై దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఇంత వరకు రెవెన్యూ మండలాలుగానే కొనసాగుతున్నాయి. కొత్త మండలాల్లో కొనసాగే పరిషత్‌ పాలన మాత్రం పాత మండలాల నుంచే కొనసాగుతోంది. దీనికి తోడు కొత్త మండలాలకు ఇప్పటికీ ఎంపీడీవోలను నియమించకపోవడంతోపాటు పాత మండలాల ఎంపీడీవోలను ఇన్‌చార్జిలుగా ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. దీంతో మండల పరిషత్‌లో ఏవైనా పనులుంటే పాత మండల కార్యాలయాలకే రావాల్సి వస్తోంది. ఇక నుంచి నూతన మండల పరిషత్‌లు ఉనికిలోకి రానుండడంతో ప్రజల బాధలు తీరనున్నాయి. కొత్త పరిషత్, పాలకవర్గం కొలువుదీరిన వెంటనే అధికారులను, సిబ్బందిని, సామగ్రిని కొత్త మండలాలకు కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

అధికారుల సన్నాహాలు
కొత్తగా ఏర్పడిన మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పాత మండలాలతో పాటే పూర్తయ్యాయి. దీంతో నూతన మండలాల ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, ఇతర పదవులకు ప్రత్యేకంగానే ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. సాధారణంగా ఎంపీపీ కార్యాలయాల్లోనే ఎంపీపీ, ఇతర పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. అందుకు ఎంపీపీ కార్యాలయాలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎంపీడీవో, సూపరింటెండెంట్, అకౌంట్స్‌ అధికారి, సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్లతోపాటు స్వీపర్లను కూడా కొత్త మండలాలకు కేటాయించాల్సి ఉంది. మొదట కార్యాలయాలకు భవనాలను ఎంపిక చేసిన తర్వాత దశల వారీగా సిబ్బంది కేటాయింపు, ఇతర కార్యక్రమాలను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
 
కొరవడిన స్పష్టత
కొత్త మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. కొత్తగా ఏర్పడిన భీంపూర్‌ మండలం ఎంపీడీవో కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఈ మండలంలో తహసీల్దార్‌ కార్యాలయం పంచాయతీ భవనంలో కొనసాగుతోంది. ఇక్కడ ప్రభుత్వ, అద్దె భవనాలు దొరకడం కొంత కష్టమే. దీంతో తహసీల్‌ కార్యాలయం పక్కనే ఒక రూంలో పంచాయతీ భవనం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే బాద్‌రూరల్‌ మండలం నుంచి విడిపోయిన మావల మండలం పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. మావల మండల రెవెన్యూ తహసీల్‌ కార్యాలయం పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల్లో కొనసాగుతోంది. ఇక్కడ మండల పరిషత్‌ ఏర్పాటుకు నూతన భవనం వెతకాల్సి ఉంది. అలాగే గాదిగూడ, సిరికొండ మండలాల్లో కూడా ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాలు దొరకడం కష్టంగా మారిన నేపథ్యంలో పరిషత్‌ ఏర్పాటు అధికారులకు ఓ విధంగా సవాల్‌గా మారిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, కొత్త మండలాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు ఇప్పటికీ చేపట్టపోగా, ఉన్న ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాల్లోనే కాలం వెల్లదీయాల్సి వస్తోంది. 

మరిన్ని వార్తలు