నవీముంబైలో రూ.10 లక్షల చోరీ

8 Aug, 2013 20:22 IST|Sakshi

నవీముంబై ఖార్ఘర్‌లో బ్యాంకు సొమ్ము తరలిస్తుండగా సాయుధ దుండగులు దాడిచేసి రూ.10 లక్షల నగదు తీసుకుని పారిపోయిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘటన నగదు తీసుకుని వెళ్లే ప్రైవేటు సెక్యూరిటీ ఏజన్సీ కార్యాలయం ఎదుటే చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల కాలంలో నవీముంబైలో ఇలాంటి సంఘటన జరగడం ఇది నాలుగోసారి కావడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు.

ఖార్ఘర్ సెక్టార్ నంబరు-7లో రెడియంట్ క్యాష్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్ కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి వేర్వేరు బ్యాంకుల ఏటీఎంలలో డబ్బులు నింపేందుకు సిబ్బంది బయలుదేరుతారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో క్యాష్ వ్యాన్లలో డబ్బులు అమరుస్తుండగా అకస్మాత్తుగా ఒక తెల్లరంగు స్కార్పియో వాహనం వచ్చింది. అందులో ఉన్న కొందరు క్యాష్ నింపే సిబ్బంది కళ్లలో కారంపొడి చల్లారు. తమవెంట తెచ్చుకున్న ఆయుధాలతో వారిపై దాడిచేసి గాయపరిచి రూ.10 లక్ష లు తీసుకుని ఉడాయించారు.

ఈ దొంగలు సైన్-పన్వేల్ రహదారి మీదుగా పన్వేల్ దిశగా వెళుతుండగా ఓ చోట ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. పక్కనే ఆగి ఉన్న ఆటో డ్రైవర్‌ను కొట్టి ఆటో తీసుకుని పారిపోయారు. కేసు నమోదుచేసిన పోలీసులకు ఇంతవరకు వారి గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. సెక్యూరిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల సాయం తీసుకుంటామని డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజయ్ ఏనాపురే చెప్పారు.

ఇటీవల కాలంలో జుయినగర్, విచంబేగావ్, వాషి కంపెనీల కార్యాలయంలో దోపిడీలు జరిగాయి. ఇందులో జుయినగర్ దోపిడీ ఘటన మినహా మిగతా రెండు కేసులు ఇంతవరకు పోలీసులు పరిష్కరించలేకపోయారు. నవీముంబై పోలీసులు చేపడుతున్న నాకాబందీలు, బీట్ మార్షల్స్ పెట్రోలింగ్ ఫలితాలివ్వడం లేదని ఈ సంఘటనలతో తేలిపోయింది.

మరిన్ని వార్తలు