పాస్‌వర్డ్స్‌ పంచుకుంటున్నారు!

5 May, 2017 13:22 IST|Sakshi
పాస్‌వర్డ్స్‌ పంచుకుంటున్నారు!

న్యూఢిల్లీ : పట్టణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థుల్లో 98.9 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. టెలికాం కంపెనీ టెలినార్‌ ఇండియా దేశవ్యాప్తంగా 13 నగరాల్లో 2,700 మంది విద్యార్థులపై సర్వే నిర్వహించింది. ఇందులో ఇంటర్నెట్‌ వాడుతున్న విద్యార్థుల్లో 54.6 శాతం మంది సులభమైన పాస్‌వర్డ్స్‌ వినియోగిస్తున్నారని పేర్కొంది. దీనివల్ల ఆన్‌లైన్‌ మోసాలు పెరగుతున్నాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా దాదాపు 54.82 శాతం విద్యార్థులు తమ పాస్‌వర్డ్స్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకుంటున్నట్లు తెలిపింది.

6 నుంచి 18 ఏళ్ల మధ్యనున్న 83.5 శాతం విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్నారని టెలినార్‌ సర్వేలో వెల్లడైంది. మొత్తం విద్యార్థుల్లో 35 శాతం మంది తమ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని చెప్పగా, కేవలం 15.74 శాతం మాత్రం తమకు అపరిచిత సందేశాలు వచ్చినట్లు అంగీకరించారు.

‘ఇంటర్నెట్‌ వినియోగంలో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో ఉంది. చాలా మంది వినియోగదారులు ముఖ్యంగా పిల్లలు.. బలహీన, సులువుగా పసిగట్టే పాస్‌వర్డ్స్‌ కారణంగా సైబర్‌ ముప్పును ఎదుర్కొంటున్నారు. డిజిటల్‌ ప్రపంచంలో పాస్‌వర్డ్స్‌ వినియోగం ప్రాముఖ్యతను తెలిపేందుకు వరల్డ్‌ పాస్‌వర్డ్స్‌ డే సందర్భంగా ఈ సర్వే నిర్వహించామ’ని టెలినార్‌ ఇండియా సీఈవో శరద్‌ మల్హోత్రా తెలిపారు.

మరిన్ని వార్తలు