వంటకాల బండి...ఇది మహిళలదండి!

19 Oct, 2016 17:33 IST|Sakshi
వంటకాల బండి...ఇది మహిళలదండి!

న్యూఢిల్లీ: గాజులు లేని వంట ఘుమ ఘుమ లాడున్....అనే మాట వంటను వృత్తిగా చేసుకొని బతుకుతున్న మగవాళ్ల గురించి స్ఫూర్తిగా చెప్పినదైయుండున్. ఇంటి వంటకు మాత్రమే పరిమితమవుతున్న మగువలు కూడా వంటను వృత్తిగా చేసుకుంటే నలభీములు కూడా వారి ముందు బలదూర్ అని నిరూపిస్తున్నారు బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల అర్చనా సింగ్. 

సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని వేడివేడిగా అందించడంతోపాటు తోటి మహిళలుకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో అర్చనా సింగ్ ట్రక్కు ద్వారా ఆహారాన్ని సరఫరాచేసే సరికొత్త స్కీమ్‌ను ప్రారంభించారు. చదువు, సంధ్యలు, నైపుణ్యం గల మహిళలు ఎక్కడైనా, ఏపనైనా చేసుకొని బతుకగలరు. ఇటు చదువు, అటు నైపుణ్యంలేని మహిళలు నేటి ఆధునిక సమాజంలో గౌరవప్రదంగా బతకడం కష్టమే. అందుకనే అర్చనా సింగ్ తన టీమ్‌లోకి అలాంటి మహిళలనే ఎక్కువగా తీసుకున్నారు. వారందరనికి ఆమెనే వివిధ ర కాల వంటకాల్లో శిక్షణ ఇచ్చారు. 

సాధారణ సంప్రదాయ భోజనాలతోపాటు పసందైన బిర్యానీ, చికెన్ టిక్కాలు, ఆలూ టిక్కీ హాట్‌డాగ్స్, చీజ్ కేక్స్ అన్నీ చేస్తారు అర్చనా సింగ్ టీమ్. వీరు తమ వంటకాలను ట్రక్కులో టెకీ సెంటర్లకు, కాలేజీలకు, ట్రాఫిక్ సెంటర్లకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అర్చనా టీమ్ ఈ వ్యాపారాన్ని చేపట్టి సరిగ్గా రెండు నెలలు కూడా కానప్పటికీ సూపర్ డూపర్ హిట్టయింది. ఘుమఘుమలాడే వంటకాలు అద్భుతం, అమోఘం అని భోజన ప్రియులు కితాబివ్వడమే కాకుండా మరిన్ని ట్రక్కులతో అన్ని వీధులకు వ్యాపారాన్ని విస్తరించాల్సిందిగా అర్చనా టీమ్‌కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. 

వారి సలహామేరకు ఇరుగు, పొరుగు పట్టణాలతోపాటు రాష్ట్రాలకు విస్తరించాలని అర్చనా సింగ్ భావిస్తున్నారు. త్వరలో ఔరంగాబాద్, పాట్నా నగరాల్లో కూడా తమ సర్వీసులను ప్రారంభిస్తున్నామని, మరో ఆరేడు నెలల్లో హైదరాబాద్-చెన్నై నగరాల మధ్య కూడా చేపడతామని చెప్పారు. ‘సెవెన్త్ సిన్’ పేరిట ట్రక్కు ద్వారా ఆహార సరఫరా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అర్చనా టీమ్ ఏడవ రోజైనా ఆదివారం నాడు విశ్రాంతేమీ తీసుకోవడం లేదు. బిచ్చగాళ్లు, నిరుపేదలు, మురకివాడల ప్రజలకు ఉచితంగా భోజనాలను అందిస్తూ సామాజిక సేవ కూడా చేస్తోంది. 

ఈ ఫుడ్ ట్రక్ సర్వీసును ప్రారంభించాలనే ఆలోచన తనకు తొలిసారిగా 2015, డిసెంబర్ నెలలోనే వచ్చిందని, నైపుణ్యంలేని మహిళలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నందున వారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రారంభించేందుకు ఇంతకాలం పట్టిందని అర్చన తెలిపారు. వంట చేయడంలో తాను ఎక్కడా శిక్షణ తీసుకోలేదని, తన తండ్రి నౌకాధికారి అవడం వల్ల ఆయనతోపాటు దేశంలోని పలు ప్రాంతాలకు తిరగాల్సి వచ్చిందని, ఆ సందర్భంగా ప్రతి వంటకాన్ని రుచి చూడడమే కాకుండా అది ఎలా చేయాలో నేర్చుకున్నానని, ఇంటి పట్టున ఉండడంకన్నా తన అభిరుచితో వ్యాపారం ఎందుకు చేయకూడదని అనుకొని ఈ వ్యాపారం ప్రారంభించానని చెప్పారు. 

ఆడవాళ్లే ఎందుకు, నైపుణ్యంగల చెఫ్‌లను తీసుకుంటే తాము కూడా పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన కొంతమంది వ్యాపారులు ఉన్నారని, అయినా తాను మహిళలతో మాత్రమే వ్యాపారాన్ని నిర్వహిస్తాననే కృతనిశ్చయంతో ముందుకు కదిలానని ఆర్చన వివరించారు. టెక్, యూనివర్శిటీ ప్రాంతాలకే కాకుండా ముందుగా ఫోన్ ద్వారా బుక్ చేసుకున్న పార్టీలకు కూడా తమ టీమ్ ఆహారాన్ని సరఫరా చేస్తోందని ఆమె చెప్పారు. ట్రక్కును తాను స్వయంగా నడుపుతుంటే ప్రవీణ్ నందూ ఫుడ్ సర్వీస్ సీఈవోగా, నటాషా పాత్రో చెఫ్‌గా, దీప, ఉషా, హేమ సహాయకులుగా పనిచేస్తున్నారని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు