లాట్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్

10 Aug, 2013 02:14 IST|Sakshi
లాట్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్

 హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినిమా హీరో అల్లు అర్జున్ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ లాట్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ  మేరకు లాట్ మొబైల్స్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 11న తమ సంస్థ హైదరాబాద్‌లో 15 కొత్త షోరూమ్‌లను ప్రారంభించనున్నదని, వీటిని తమ బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్ ప్రారంభిస్తారని పేర్కొంది. దీంతో హైదరాబాద్‌లో తమ మొత్తం మొబైల్ షోరూమ్‌ల సంఖ్య 50కు చేరుతుందని, ఇవన్నీ ప్రత్యేక లైవ్  ఎక్స్‌పీరియన్స్ షోరూమ్‌లుగా వినియోగదారులకు సేవలందిస్తాయని వివరించింది. తమ షోరూమ్‌ల్లో అన్ని రకాల బ్రాండ్స్, మొబైల్ ఫోన్స్‌ను అన్ని బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ లేకుండా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ప్రతి మొబైల్ కొనుగోలుపై బీమా, విక్రయానంతర సేవలు అందిస్తున్నామని, లాట్ మొబైల్స్‌లో ఒక లక్షకు పైగా ఆప్స్ డౌన్‌లోడ్ చేసుకునే వీలుందని కంపెనీ వివరించింది.


 సీడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా మండవ
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు, పబ్లిక్ రంగంలోని విత్తన కంపెనీలకు నేతృత్వం వహిస్తున్న నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఏఐ) నూతన ప్రెసిడెంట్‌గా నూజివీడు సీడ్స్ సీఎండీ మండవ ప్రభాకరరావు నియమితులయ్యారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన అసోసియేషన్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ మేరకు ఆయనను ఎంపిక చేశారు. 2013-15 కాలానికి ఆయనీ పదవిలో కొనసాగుతారు. విత్తన పరిశ్రమ ఎదుర్కొంటున్న నియంత్రణపరమైన సమస్యలపై పనిచేస్తానని ఈ సందర్భంగా ప్రభాకరరావు తెలిపారు. ఎన్‌ఎస్‌ఏఐలో 238 విత్తన కంపెనీలకు సభ్యత్వం ఉంది.

మరిన్ని వార్తలు