బ్యాగ్, లాప్‌టాప్ ఎత్తుకెళ్లాలనుకున్నాడు

6 Mar, 2014 10:40 IST|Sakshi
బ్యాగ్, లాప్‌టాప్ ఎత్తుకెళ్లాలనుకున్నాడు
* అనూహ్య హంతకుడిమొదటి ఉద్దేశం ఇదే
* సామగ్రితో బైక్‌పై ఉడాయించాలనుకున్నాడు
* అవకాశం లేకపోవడంతోనే ఆమెను ఎక్కించుకున్నాడు
 
ముంబై: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య (23) హత్య కేసులో నిందితుడైన చంద్రభాన్ సనప్ పోలీసుల విచారణలో కీలక వివరాలు వెల్లడించినట్లు ఓ జాతీయ ఆంగ్ల చానల్ తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ముంబై క్రైం బ్రాంచికి చెందిన ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం...వాస్తవానికి చంద్రభాన్ అనూహ్య బ్యాగ్, ల్యాప్‌టాప్‌ను చోరీ చేయాలనే పథకం వేసుకున్నాడు. ఆమెపై అత్యాచారయత్నం లేక హత్య చేయాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదు.

ప్లాట్‌ఫారం నుంచి బైక్ ఉన్న చోటుకు ఆమెను తీసుకొచ్చాక వస్తువులతో అతను ఉడాయించాలనుకున్నాడు. ఆమె బ్యాగ్‌ను లాక్కొని పెట్రోల్ ట్యాంక్‌పై పెట్టుకొని ఇంజిన్ స్టార్ట్ చేశాడు. దీంతో అతను సామానుతో ఉడాయిస్తాడని కంగారుపడిన అనూహ్య వెంటనే బైక్‌పై ఎక్కి కూర్చుంది. ఆమె స్పర్శ తగలడంతో చంద్రభాన్‌కు అనూహ్యను రేప్ చేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. ట్యాక్సీలో తీసుకెళ్తానన్న చంద్రభాన్ చివరకు బైక్‌పై తీసుకెళ్తాననేసరికి అనూహ్య అవాక్కైందని అధికారి చెప్పారు. 
 
విచారణలో చంద్రభాన్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.
చంద్రభాన్: మేడం...మీరు ఎక్కడకి వెళ్లాలి?. అతని మాటలను అనూహ్య తొలుత పట్టించుకోలేదు.
 
చంద్రభాన్: మేడం...ఎక్కడికి వెళ్లాలో చెప్పండి? నేను ట్యాక్సీ డ్రైవర్‌ను. చౌకగానే తీసుకెళ్తా
అనూహ్య: అంధేరీ వెస్ట్
 
చంద్రభాన్: మంచిదైంది. నేను కూడా అంధేరీ వెళ్తున్నా. నా ట్యాక్సీ కూడా అక్కడిదే. 300 తీసుకుంటా.
చంద్రభాన్ మాటలకు అనూహ్య స్పందించేలోగానే అతను ఆమె ట్రాలీ బ్యాగ్‌ను లాక్కుంటూ నడవడం మొదలుపెట్టాడు. దీంతో అనూహ్య అతని వెంట నడవడం మొదలుపెట్టింది. సెల్‌ఫోన్లో కుటుంబ సభ్యుడితో మాట్లాడుతూ అతని వివరాలు చెబుతున్నట్లు నటించింది. వారిద్దరూ స్టేషన్ బయటకు వచ్చాక ట్యాక్సీ బదులు బైక్ వద్ద చంద్రభాన్ నిలబడటం చూసి అనూహ్య అవాక్కైంది. ‘‘ట్యాక్సీ అని చెప్పావు ఇది బైక్ కదా’’ అంది. అందుకు చంద్రభాన్ స్పందిస్తూ ‘‘మేడం...ఇంత చౌకగా ట్యాక్సీలో ఈ వేళ ఎవరు దింపుతారు. పదండి. నా దగ్గర పెట్రోల్ కొట్టించేందుకు డబ్బులు కూడా లేవు. అందుకే ప్రయాణికుల కోసం వెతుకుతున్నా’’ అన్నాడు.
 
అయితే ఆటో లేక ట్యాక్సీ కోసం అనూహ్య కాసేపు చూసినా ఏదీ కనిపించలేదు. దీంతో చంద్రభాన్ ఆమె బ్యాగ్‌ను వాహనంపై పెట్టుకున్నాడు. దీంతో ఆమె అతని బైక్ ఎక్కి కూర్చుంది. ఆ తర్వాత ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే జంక్షన్‌పై కంజూర్‌మార్గ్ వద్ద చంద్రభాన్ బైక్‌ను ఎడమ వైపు మలుపు తిప్పకపోవడంతో కంగారుపడిన అనూహ్య అతన్ని ప్రశ్నించింది. ‘‘ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తన్నావు? దీనికి చంద్రభాన్ బదులిస్తూ ‘‘మేడం ఇది షార్ట్‌కట్. మిమ్మల్ని 10 నిమిషాల్లో అంధేరీకి చేరుస్తా’’ అన్నాడు.
 
అనూహ్య తండ్రిని కలిసిన ముంబై పోలీసు అధికారి
మచిలీపట్నం, న్యూస్‌లైన్: అనూహ్య హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ముంబై కుర్లా పోలీస్‌స్టేషన్ క్రైం బ్రాంచ్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రాణే బుధవారం మచిలీపట్నం వచ్చారు. అనూహ్య తండ్రి ప్రసాద్‌ను కలిసి తమ వద్ద ఉన్న సమాచారాన్ని తెలిపి, ఫొటోలను చూపారు.

అనూహ్య రైల్వే స్టేషన్‌లో దిగిన సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్‌లు, ఆమె పక్కనే నడుస్తున్న చంద్రభాన్ ఫోటోను చూపారు. అనూహ్య హత్య తర్వాత చంద్రభాన్ గడ్డం పెంచుకుని, వేషం మార్చుకుని తిరిగిన విధానాన్ని వివరించారు. అనూహ్య మృతదేహం లభ్యమైన రెండో రోజునే చంద్రభాన్‌ను అదుపులోకి తీసుకున్నామని, అప్పటికి అతను గడ్డం పెంచుకుని ఉండటంతో గుర్తించలేకపోయామని వివరించారు. 
మరిన్ని వార్తలు