అదో సిల్లీ కేసు

26 Aug, 2015 18:38 IST|Sakshi
అదో సిల్లీ కేసు

దాని పూర్తి వివరాలు నా దృష్టిలో ఉండవు
కేటీఆర్ గన్‌మెన్‌పై ఉన్న కేసుపై డీజీపీ వ్యాఖ్య
మత్తయ్య మా దృష్టిలో ఫిర్యాదుదారుడని స్పష్టీకరణ

హైదరాబాద్: విశాఖపట్నం పోలీసు కమిషనరేట్‌లోని పెందుర్తి పోలీసుస్టేషన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ గన్‌మెన్, అనుచరులపై నమోదుయిన కేసు సిల్లీ కేసు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకట రాముడు వ్యాఖ్యానించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాముడు మాట్లాడారు. ఈ కేసుతో పాటు ఓటుకు కోట్లు కౌంటర్ కేసులపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు డీజీపీ ఇలా స్పందించారు.

విలేకరులు: 2013లో పెందుర్తితో కేటీఆర్ గన్‌మెన్, అనుచరులపై ఉన్న కేసు ఏమిటి? ఇన్నాళ్ళ తరవాత ఇప్పుడు హడావుడిగా నోటీసులు ఎందుకు జారీ చేశారు?
డీజీపీ: అదో సిల్లీ కేసు. అలాంటి వాటికి సంబంధించిన వివరాలన్నీ నా దగ్గర ఉండవు. రోటీన్‌గానే నోటీసులు ఇచ్చి ఉంటారు. స్థానిక పోలీసుల్ని అడగండి.

విలేకరులు: తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఓటుకు కోట్లు కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్యకు ఏపీ పోలీసులు షెల్టర్ ఇచ్చారనే విమర్శలున్నాయి కదా...!
డీజీపీ: మత్తయ్య ఓ ఫిర్యాదుదారిడిగానే మాకు తెలుసు. ఓ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తికి అండగా ఉండాల్సిన బాధ్యత పోలీసులకు, ప్రభుత్వానికి ఉంది. అందుకు తగ్గట్టే స్పందించాం.

విలేకరులు: రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దాడులు పెరిగాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని సంఘటనలూ కనిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి?
డీజీపీ: రాష్ట్రంలో ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎవరైనా బాధితులు ఉంటే వచ్చి నాతో మాట్లాడవచ్చు. అయితే ఈ సందర్భంగా అక్కడే ఉన్న అదనపు డీజీ (శాంతిభద్రతలు) ఆర్పీ ఠాకూర్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ... గడిచిన ఆరు నెలల్లో ఒక్క ఫ్యాక్షన్ హత్య  కూడా నమోదు కాలేదన్నారు.  పొలిటికల్ క్రైమ్ పూర్తిగా తగ్గిందని చెప్పారు.

విలేకరులు: ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తున్న కేసులు తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఓటుకు కోట్లుకు కౌంటరేనా? నోటీసుల జారీ కూడా వారి యాక్షన్‌కు రియాక్షన్‌లా కనిపిస్తోంది...
డీజీపీ: వీటిపై మీ ఉద్దేశం ఏమిటి? అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. సీఐడీ దగ్గర ఉన్న కేసు దర్యాప్తులో భాగంగానే నోటీసుల జారీ ప్రక్రియ జరుగుతోంది. దీనిపై ఎక్కువ ఆలోచించకండి.

విలేకరులు: కొందరు మాజీ డీజీపీలే మీవి కౌంటర్ కేసులని, మీది రియాక్షన్ అని అంటున్నారు కదా..!
డీజీపీ: రిటైర్ అయినవాళ్ళు ఏదైనా చెప్పవచ్చు. వారికి ఎలాంటి క్రమశిక్షణా నియమావళిలు ఉండవు. అది వాస్తవం కాదు.

విలేకరులు: ఏపీ-తెలంగాణ పోలీసు మధ్య విభేదాలు వచ్చాయని, అవి కొనసాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి...
డీజీపీ: మేమంతా ఆలిండియా సర్వీసు అధికారులం. మాకు నేషనల్ ఇంట్రెస్ట్ అనేది తొలి ప్రాధాన్యం. దేశం మొత్తానికి ఒకే పోలీసు వ్యవస్థ ఉంటుంది. తెలంగాణ అధికారులతో స్నేహపూరితంగా ఉన్నాం. ఎలాంటి అగాధం లేదు.
 

మరిన్ని వార్తలు