ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

22 Mar, 2017 01:23 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ఎల్‌వోసీలో ఘటన
ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని సుర్జాపూర్‌ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ మంద రాజశేఖర్‌(21) జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ఎల్‌వోసీలో ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో ఉండగానే ఆయన ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీతో కుడి కణతపై కాల్చుకొని చనిపోయాడు. ఈ విషయం మంగళవారం ఆలస్యంగా ఇక్కడికి సమాచారం అందించింది. సుర్జాపూర్‌కు చెందిన మంద శివయ్య పెద్దకొడుకు అయిన రాజశేఖర్‌ ఏడాదిన్నర క్రితం ఆర్మీ జవానుగా ఎంపికై మహారాష్ట్రలోని పుణెలో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. పాకిస్తాన్‌–ఇండియా బోర్డర్‌లో గల జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ఎల్‌వోసీలో సెంట్రీగార్డుగా పని చేస్తున్నాడు.

 సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం విధుల్లోకి వెళ్లాడు. రాజశేఖర్‌తో పాటు విధులు నిర్వర్తిస్తున్న మరో ఆర్మీ జవాన్‌ భోజనానికి వెళ్లి వచ్చేలోగా ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీతో కాల్చుకున్నట్లు ఖానాపూర్‌ సీఐ అంగోతు పవార్‌నరేశ్‌ కుమార్‌ తెలిపారు. కాగా, కుప్వార ఎల్‌వోసీ నుంచి అతని మృతదేహాన్ని అతి కష్టంపై మీది నుంచి కిందకు మంగళవారం తెచ్చారు.

రాజశేఖర్‌ మృతదేహానికి శ్రీనగర్‌లో పోస్టుమార్టం చేయించిన అనంతరం విమానంలో నాగ్‌పూర్‌కు, అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకొస్తారు. అయితే, తట్టుకోలేని వాతావరణ పరిస్థితులతో పాటు.. సకాలంలో సెలవు దొరకకపోవడంతోనే రాజశేఖర్‌ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు