టీడీపీతో పొత్తు కోసం తెలంగాణలో బీజేపీని చంపుతారా?

10 Feb, 2014 01:46 IST|Sakshi
యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి

 వెంకయ్యపై యెన్నం ధ్వజం
 ఆయన ఒక ప్రాంత ప్రతినిధిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం
 ఇది నోటికాడికొచ్చే ముద్దను లాగుతున్నట్లు కాదా అని ప్రశ్న
 ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని లగడపాటికి యెండల వినతి

 
 న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  తెలంగాణ బిల్లును అధ్యయనం చేసిన తరువాతే దానికి మద్దతుపై స్పందిస్తామంటూ బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ కల సాకారమయ్యే సమయంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యలు పాలకుండలో విషం చిమ్మినట్లుగా ఉందని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు సీమాంధ్ర ప్రతినిధిగా ఉన్నాయే తప్ప.. ఆయన జాతీయ నాయకుడిగా పార్టీ విధానాన్ని మాట్లాడటం లేదని విమర్శించారు. సీమాంధ్రలో పార్టీకి ఊపిరిపోయటం కోసం, తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం తెలంగాణలో సజీవంగా ఉన్న పార్టీని చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యెన్నం ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని ఏపీభవన్‌లో బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు.

‘‘తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, బిల్లు మీరు పెట్టకుంటే మేమే పెడతామన్న వెంకయ్యనాయుడు ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసం? తెలంగాణ కోసం వందలాది యువకులు బలిదానం చేసుకున్న సంగతి తెలియదా? బీజేపీ కార్యకర్తలు చనిపోయిన సంగతి విస్మరించారా? సీమాంధ్ర ప్రతిపాదనలను జైరాం రమేశ్‌కు అందజేసిన మీరు.. తెలంగాణ తరపున మేమిచ్చిన వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? జాతీయ నాయకుడిగా ఉంటూ ఈ విషయంలో ఒక ప్రాంత ప్రతినిధిగా మాట్లాడడం పక్షపాతం కాదా? నోటికాడికొచ్చే ముద్దను లాగుతున్నట్లు కాదా?  రాజ్యసభలో బిల్లును అడ్డుకుంటే మా పరిస్థితి ఏమిటి? సీమాంధ్ర కోసం తెలంగాణలో పార్టీని చంపుతారా?  తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీని ఫణంగా పెడతారా? 2004 సమయంలో టీడీపీతో పొత్తు పెట్టి బీజీపీనీ భ్రష్టు పట్టించిన మీరు ఇప్పుడు మళ్లీ అదే పనిచేస్తున్నారంటే ఏమనుకోవాలి? ఏనాడూ సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించని మీకు ఇప్పుడు పార్టీ గుర్తుకొచ్చిందా? అందుకోసం తెలంగాణలో పార్టీని చంపి సీమాంధ్రలో బతికించుకోవాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించారు.  యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంటు లో విభజన బిల్లును అడ్డుకునేందుకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమని చెబుతున్న సబ్బంహరికి జై ఆంధ్రా, జై తెలంగాణ ఉద్యమంలో ఎన్ని వందలమంది ప్రాణాలు కోల్పోయారో తెలియదా అని ప్రశ్నించారు. ‘‘విభజన బిల్లును అడ్డుకునేందుకు క్రికెట్, కబడ్డీ ఆడతానంటున్న లగడపాటిని ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని కోరుతున్నా. అధికారంలోకొస్తే తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో హామీనిచ్చి గెలిచిన లగడపాటి.. పార్టీ ఇచ్చిన హామీని నెరవేరుస్తుంటే ఇప్పుడెందుకు ఎగిరిపడుతున్నాడు?’’ అని ధ్వజమె త్తారు.
 
 ప్రాంతీయ నేతగా వ్యవహరించొద్దు: నాగం
 
 నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: సున్నితమైన తెలంగాణ అంశం గురించి మాట్లాడేటప్పుడు స్థాయిని మరిచి ప్రాంతీయ నేతగా వ్యవహరించొద్దని వెంకయ్యనాయుడికి నాగర్‌కరూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘తెలంగాణ బీజేపీ నేతలమంతా ఆయన్ను కలుస్తాం. నష్టపోయిన వారికి ఏం సవరణలు అక్కరలేదా? దోచుకున్నవారికే మళ్లీ దోచి పెడతారా అని ప్రశ్నిస్తాం. తెలంగాణకు కట్టుబడి ఉంటామని చెబుతూనే మరోవైపు సవరణల పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారు. బీజేపీలో ఏ ఒక్క వ్యక్తి నిర్ణయం చెల్లుబాటు కాదు. కేంద్ర కమిటీ తీర్మానమే అమలవుతుంది’’ అని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు