జైట్లీ రాజీనామాకు విపక్షాల పట్టు

21 Dec, 2015 12:45 IST|Sakshi
జైట్లీ రాజీనామాకు విపక్షాల పట్టు

న్యూఢిల్లీ: డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్)లో అక్రమాల వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది. సోమవారం ఉదయం లోక్ సభ ప్రారంభమైన వెంటనే.. కుంభకోణంలో పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలంటూ  విపక్షాలునినదించారు. డీడీసీఏపై చర్చించేవీలులేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పడంతో విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలకు ఆటంకం ఏర్పడటంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు.

అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై దుమారం చెలరేగింది. సభ ప్రారంభానికి ముందే విపక్ష కాంగ్రెస్ డీడీసీఏపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. చైర్మన్ తీర్మానాన్ని అంగీకరించకపోవడంతో అరుణ్ జైట్లీ రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చారు. దీంతో సభ 30 నిమిషాలు వాయిదాపడింది.

 

వరుస వాయిదాల అనంతరం 12:30కు లోక్ సభ తిరిగి ప్రారంభమైంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తనపై వచ్చిన ఆరోపణలపై వివరాణ ఇచ్చేందుకు ఉద్యుక్తులుకాగా, విపక్ష ఎంపీలు ఆయనకు అడ్డుతగిలారు. ఒక సందర్భంలో ఆగ్రహానికి లోనైన జైట్లీ 'కూర్చొని వినండి' అంటూ గట్టిగా అరిచారు. దీనికి ప్రతిగా విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. కుంభకోణంలో తన పాత్ర ఏమీలేదని జైట్లీ వివరణ ఇచ్చారు.

ఏమిటీ కుంభకోణం?
ప్రస్తుత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షునిగా ఉన్న 13ఏండ్ల కాలంలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. జైట్లీ హయాంలో డీడీసీఏ ఎన్నో అక్రమాలకు పాల్పడిందనీ, అతణ్ని మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర అధికార పార్టీ ఆప్ కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్‌ను కూడా నియమించింది ఢిల్లీ ప్రభుత్వం. 2008-12 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ. 24.45 కోట్ల వినోదపు పన్నును డీడీసీఏ ఎగ్గొట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. మొన్నటి భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ సందర్భంలోనూ ఈ విషయం వివాదాస్పదం కావటం, డీడీసీఏ కోర్టుకెళ్లడం, ప్రభుత్వానికి తాత్కాలికంగా రూ. కోటి చెల్లించాలని కోర్టు ఆదేశించడం తెలిసిందే.

ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో నిర్మించిన కార్పొరేట్‌ బాక్సుల విషయంలో అక్రమాలు జరిగాయని బీజేపీకే చెందిన ఎంపీ కీర్తి ఆజాద్‌ వెల్లడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కార్యదర్శి రాజేంద్రకుమార్‌ కార్యాలయంపై సీబీఐ నిర్వహించిన సోదాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ సోదాలు అరుణ్‌ జైట్లీని కాపాడే ఉద్దేశంతో డీడీసీఏ ఫైళ్ల కోసమే సీబీఐ హడావుడి చేసిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆ సందర్భంగా ఆరోపించారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు