2న కేబినెట్ భేటీ

30 Dec, 2015 01:05 IST|Sakshi
2న కేబినెట్ భేటీ

♦ కేసీఆర్ ఆధ్వర్యంలో మూడు నెలల తరువాత మంత్రివర్గ సమావేశం
♦ బడ్జెట్ సమావేశాలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, సంక్షేమంపై
♦ రెండు విడతలుగా చర్చ
♦ మధ్యాహ్నం అధికారులకు ముఖ్యమంత్రి విందు
 
 సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. దాదాపు మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంతో పాటు త్వరలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. జనవరి 2వ తేదీ నాటికి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతోంది. అదే రోజున సుదీర్ఘ చర్చలకు వీలుగా రెండు విడతలుగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

భోజన విరామంలో మారియట్ హోటల్‌లో   ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి విందు ఇవ్వనున్నారు. వరంగల్ ఉప ఎన్నికలు, అయుత చండీయాగం విజయవంతం కావడంతో ఈ విందు ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు చె బుతున్నాయి. మరోవైపు ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎ న్నికల ఫలితాలు సైతం బుధవారం వెలువడనున్నాయి. దీంతో కొత్త ఏడాదిలో జరిగే తొలి కేబినెట్ సమావేశం అందర్నీ ఆకర్షిస్తోంది.

 ‘జీహెచ్‌ఎంసీ’ వరాలకు ఆమోదం!
 జనవరి చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం సూచనప్రాయంగా పలు వరాలు కురిపించిం ది. విద్యుత్, నల్లా బిల్లుల బకాయిలను మాఫీ చేస్తామని నగర పరిధిలోని మంత్రులకు సీఎం హామీ ఇచ్చారు. ‘ఎమ్మెల్సీ’ ఎన్నికల కోడ్ కారణంగా అధికారికంగా నిర్ణయం వెలువడలేదు. ఆ బకాయిల రద్దుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎనిమిది లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా రూ.2 వేలలోపు ఉన్న ఆస్తిపన్నును రద్దు చేయడం లేదా నామమాత్రపు పన్నుగా మార్చడానికి అనుమతించే అవకాశముంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై చర్చించి మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించి, ఎన్నికల వ్యూహాన్ని నిర్దేశించనున్నారు. రెండు పడక గదుల ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక, మిషన్ కాకతీయపై చర్చించనున్నారు.

 3న టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ...
 కేబినెట్ భేటీ తర్వాత జనవరి 3న మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్లమెంటు సభ్యులను ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

 5న కేటీపీఎస్ స్టేజ్-2 ప్రారంభం
 వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (కేటీపీఎస్) స్టేజ్-2 కింద నెలకొల్పిన 600 మెగావాట్ల యూనిట్‌ను సీఎం కేసీఆర్ వచ్చే నెల 5వ తేదీ న ఉదయం 11 గంటలకు ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం వరంగల్ కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై సమీక్షిస్తారు. టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం, మిషన్ భగీరథ, వరంగల్ నగరాభివృద్ధి, కాకతీయ కాలువల మరమ్మతులు, సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లపై చర్చిస్తారు.

అయితే అంతకంటే ముందు రోజే 4వ తేదీన హైదరాబాద్-వరంగల్ రహదారి విస్తరణ పనులకు కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఏటూరునాగారం వద్ద నిర్మించిన భారీ వంతెనకు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమాలకు సైతం సీఎం హాజరుకానున్నారు. 7వ తేదీన మెదక్ జిల్లా ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి రాధా మోహన్‌సింగ్ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.
 
 వంద మంది భోజనం చేసే వసతి లేదా?
 రాష్ట్ర సచివాలయంలో కనీసం వంద మంది భోజనం చేసేందుకు వసతి లేకపోవడంపై సీఎం కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వచ్చే నెల 2న రాష్ట్ర మంత్రివర్గ భేటీ నిర్వహించే అంశంపై సీఎం మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. కేబినెట్ భేటీ ఆరేడు గంటల పాటు సుదీర్ఘంగా నిర్వహిద్దామని కేసీఆర్ చెప్పారు. దీనికి అధికారులు సమ్మతిస్తూనే.. మధ్యాహ్నం భోజనం (వర్కింగ్ లంచ్) ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఈ భోజనం ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై ఆసక్తికర చర్చ జరిగింది.

సచివాలయంలో ‘సి’ బ్లాక్‌లోని మూడో అంతస్తులో కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తారు. నాలుగో అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. కేబినెట్ భేటీకి హాజరయ్యే మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఇతర అధికారులంతా కలసి సుమారు వంద మంది వరకు ఉంటారు. దీంతో ఇంత మందికి ఒకే చోట భోజనం వడ్డించేందుకు సచివాలయంలో అనువైన ప్రదేశం ఎక్కడ ఉందని సీఎం ఆరా తీయగా... అంత మందికి సరిపడే స్థలం సచివాలయంలో ఎక్కడా లేదని అధికారులు తేల్చారు. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి... చివరకు ఓ పరిష్కారాన్ని ఆలోచించారు. మంత్రులు ఎవరి భోజనం వారు తెచ్చుకోవాలని... అధికారులకు మాత్రం కేబినెట్ భేటీ విరామ సమయంలో సమీపంలోని మారియట్ హోటల్‌లో లంచ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు