నాస్కామ్ ప్రెసిడెంట్‌గా చంద్రశేఖర్

6 Jan, 2014 02:40 IST|Sakshi
నాస్కామ్ ప్రెసిడెంట్‌గా చంద్రశేఖర్

న్యూఢిల్లీ:ఐటీ కంపెనీల అసోసియేషన్.. నాస్కామ్ ప్రెసిడెంట్‌గా మాజీ టెలికం సెక్రటరీ రెంటాల  చంద్రశేఖర్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.1975  బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆర్. చంద్రశేఖర్... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. 1997, జూన్ నుంచి 1999 డిసెంబర్ వరకూ ఆయన ఈ సేవలందించారు.
 
 కీలక పదవులు...
 ఐఐటీ-ముంబైలో ఎం.ఎస్‌సీ (కెమిస్ట్రీ) అభ్యసించిన ఆయన ఎం.ఎస్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్)ను అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ నుంచి పొందారు.  ఐటీ, టెలికం కార్యదర్శులుగా కూడా పనిచేసిన ఆయన  జాతియ టెలికం విధానం 2012, తొలి జాతీయ ఐటీ విధానం, జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. ఇక నాస్కామ్ సంస్థ  10,800 కోట్ల డాలర్ల ఐటీ-బీపీఎం పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తోంది. నాస్కామ్ సంస్థకు 2007-13 వరకూ అధ్యక్షుడిగా వ్యవహరించిన సోమ్ మిట్టల్ స్థానంలో చంద్రశేఖర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాస్కామ్ ప్రెసిడెంట్ పదవి స్వీకరించడం ఆనందంగా ఉందని చంద్రశేఖర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత ఐటీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అపారంగా ఉన్నాయని, 2020 నాటికల్లా భారత  ఐటీ పరిశ్రమ 30,000 కోట్ల డాలర్లకు చేరే లక్ష్యం కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు