హైదరాబాద్‌లో అవసరమైతే సైన్యం సాయం!

22 Sep, 2016 18:35 IST|Sakshi
హైదరాబాద్‌లో అవసరమైతే సైన్యం సాయం!

హైదరాబాద్‌: హైదరాబాద్‌ను ఎడతెరిపి లేని వర్షాలు బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో నగరంలోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు గురువారం​ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డికి ఫోన్‌ చేసి.. నగరంలోని పరిస్థితిని ఆరా తీశారు. భారీ వర్షాలు, వరదల వల్ల పరిస్థితి తీవ్రంగా ఉంటే.. సైన్యం సహాయం తీసుకోవాలని సూచించారు.

మరోవైపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలపై డీజీపీ అనురాగ్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పనిచేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు.  ఛలాన్లు ఆపేసి.. ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాలని ఆయన సూచించారు.

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు భయపెడుతున్న సంగతి తెలిసిందే. గత రెండురోజులుగా కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలమైంది. తాజాగా గురువారం మధ్యాహ్నం నుంచి పలుప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, ముషీరాబాద్, మూసాపేట్, బంజారాహిల్స్, తార్నాక, బర్కతపురా, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, నిజాంపేట్, మియాపూర్, ఉప్పల్, మాదాపూర్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. మొన్న కురిసిన భారీ వర్షానికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు నిన్న వర్షం తెరపివ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
 
మళ్లీ ఇప్పుడు భారీ వర్షం ముంచెత్తడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వందలాది అపార్ట్ మెంట్ల సెల్లార్లలో భారీగా నీరు చేరింది. పలు చోట్ల చెరువులు నిండు కుండలా మారాయి. తాజా వర్షంతో నగరంలోని రహదార్లు చెరువులుగా మారుతున్నాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రాంతాల ప్రజలు నిత్యావసర వస్తువులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట బంగారీ లేఅవుట్ లో నీట మునిగిన అపార్ట్‌మెంట్స్‌లో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో దిక్కు తోచని స్థితిలో స్థానికులు ఉన్నారు. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి చార్మినార్ చుట్టూ భారీగా వరద నీరు చేరింది. దీంతో..స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొకాళ్ల లోతు నీటిలో తీవ్ర అవస్థలు పడుతున్నారు.

>
మరిన్ని వార్తలు