విజిలెన్స్ కమిషన్ వెలికితీసిన అక్రమాల విలువ... 7వేల కోట్లు!!

4 Sep, 2013 16:17 IST|Sakshi

చిన్నా చితకా అక్రమాల నుంచి మొదలుపెట్టి.. కోల్గేట్ కుంభకోణం వరకు దేశంలో జరుగుతున్న అనేకానేక స్కాముల గుట్టును రట్టుచేసిన ఘనత కేంద్ర విజిలెన్స కమిషన్ (సీవీసీ)కే దక్కుతుంది. గత సంవత్సరంలో, అంటే 2012లో సీవీసీ బయటపెట్టిన మొత్తం అక్రమాల విలువ ఎంతో తెలుసా.. అక్షరాలా 7 వేల కోట్ల రూపాయలు!!

బీహార్కు చెందిన ఓ టెలివిజన్ గ్రూపు ముంబైలోని స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అందించే క్రెడిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమును దుర్వినియోగం చేసి 2,700 కోట్ల రూపాయలు వెనకేసుకున్న వైనాన్ని సీవీసీ బయటపెట్టింది. 2006-2009 సంవత్సరాల మధ్య జరిగిన బొగ్గు గనుల కేటాయింపుపై కొంతమంది ఎంపీలు ఫిర్యాదు చేయగా, దానిపై విచారణ జరిపిన సీవీసీ.. భారీ కుంభకోణాన్నే బయటపెట్టింది. అదిప్పుడు అధికార పీఠాలను కదిలించే స్థాయిలో ఉంది. ఈ కుంభకోణంలో కొన్ని ఫైళ్లు కనిపించకుండా పోవడంపై సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంటులో వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ కేసులో సీబీఐ ఇప్పటివరకు మూడు ప్రాథమిక విచారణలు జరిపి, 13 ఎఫ్ఐఆర్లు దాఖలు చేసింది.

ఇక మూడు టెలింక దిగ్గజాలకు ప్రభుత్వం ఇచ్చిన టెలికం లైసెన్సులను ఆయా కంపెనీలు దుర్వినియోగం చేశాయంటూ ఫిర్యాదు రావడంతో ఆ స్కాంపై దర్యాప్తు చేసి కళ్లు చెదిరే నిజాలను బయటపెట్టింది. దీంతో మూడు టెలికం కంపెనీలకు టెలికం శాఖ 50 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అలాగే, మూడు వేర్వేరు కేసుల్లో మూడు బ్యాంకులకు ప్రమేయం ఉన్న 3,568.8 కోట్ల రూపాయల అక్రమాలనూ సీవీసీ గుర్తించింది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి అధికారి ఒకరు అక్రమాలకు పాల్పడటంతో 46 కోట్ల రూపాయల నష్టం రాగా, దాన్ని కూడా బయటపెట్టింది.

మరిన్ని వార్తలు