వివాదంలో దంగల్‌ నటి

8 Jun, 2017 19:38 IST|Sakshi
వివాదంలో దంగల్‌ నటి

‘దంగల్‌’ ఫేం ఫాతిమా సనా షేక్‌ ‘స్విమ్‌ సూట్‌’ వివాదంలో చిక్కుకుంది. చెయ్యకూడని పని చేశావంటూ నెటిజన్లు ఆమెపై నిప్పులు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె.. అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ సినిమా షూటింగ్‌ నిమిత్తం ద్వీపదేశం మాల్టాలో ఉంది. అక్కడి సముద్ర తీరంలో స్విమ్‌సూట్‌ ధరించి సనా ఓ ఫొటోషూట్‌ చేసింది. హీరోయిన్లు ఇలాంటి షూట్లు చేయడం సహజమే కానీ ఫాతిమా సనా ముస్లిం కావడం, అందులోనూ ఇది రంజాన్‌ మాసం కావడం వివాదానికి దారితీసిన అంశాలు.

‘ఇస్లాంను పాటించే నువ్వు(ఫాతిమా సనా) పవిత్ర రంజాన్‌ మాసంలో ఇలాంటి ఫొటోలు దిగి మమ్మల్ని బాధపెట్టావు. ఈ ఒక్క నెలైనా నువ్విలాంటి పని చేయకుండా ఉండాల్సింది’  అంటూ కొందరు ఆమెపై కామెంట్ల దాడిచేయగా, మరికొందరు మాత్రం ‘ఇందులో తప్పేముంది? నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఆమెకు ఉంది’అని సనాను సమర్థించే ప్రయత్నం చేశారు. ఈ వివాదంపై అటు సనాగానీ, ఇటు ‘ఠగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ యూనిట్‌గానీ స్పందించలేదు.


క్రేజీ ప్రాజెక్ట్‌
ఫాతిమా సనా షేక్‌ ప్రస్తుతం నటిస్తోన్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’  సినిమా ప్రఖ్యాత ‘కన్ఫెషన్‌ ఆఫ్‌ ఏ థగ్‌’ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. దోపిడీదారులైన సయీద్‌ అమీర్‌ అలీ, అతని తండ్రి జీవితాల ఆధారంగా రచయిత ఫిలిప్‌ మిడోస్‌ 1839లో ఈ నవల రాశారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ సినిమాలో అమితాబ, ఆమిర్‌లు తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు.


మరిన్ని వార్తలు