ప్రభుత్వాల కన్నా సీఈవోలే బెటర్‌

13 Feb, 2017 20:06 IST|Sakshi
ప్రభుత్వాల కన్నా సీఈవోలే బెటర్‌

ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రజలకు.. ప్రభుత్వం, వ్యాపారం, మీడియా, ఎన్జీవోలపై రానురాను నమ్మకం సన్నగిల్లుతోంది. సర్వే నిర్వహించిన 28 దేశాల్లో ఈ రంగాలపై మూడింట రెండు వంతుల మంది ప్రజలకు నమ్మకం పోయిందని ‘ఎడల్‌మేన్‌’ కమ్యూనికేషన్‌ గ్రూప్‌ తెలిపింది. పైగా ఈ నమ్మకం ప్రతి ఏటా క్షీణిస్తూ వస్తోందని తన సర్వేలో తేలినట్లు ఆ గ్రూప్‌ పేర్కొంది.

సర్వే ఫలితాల ప్రకారం వ్యాపార రంగానికి సంబంధించి కార్పొరేట్‌ సీఈవోలను ఎంత మంది విశ్వసిస్తారని ప్రశ్నించగా, 37 శాతం మంది మాత్రమే అవునని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే సీఈవోలను విశ్వసించే వారి సంఖ్య 12 శాతం తగ్గింది. అయినా ప్రభుత్వాలకన్నా సీఈవోల పట్ల ఎక్కువ మంది విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. సర్వే నిర్వహించిన 28 దేశాల్లో ప్రభుత్వాల పట్ల 29 శాతం మంది మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు. మీడియా పట్ల ప్రజల విశ్వాసం గతేడాదికన్నా పడిపోయినా ప్రభుత్వం కన్నా మీడియానే ఎక్కువ మంది విశ్వసించడం విశేషం. గతేడాది మీడియాను 48 శాతం మంది ప్రజలు విశ్వసించగా, ఈసారి అది 43 శాతానికి పడిపోయింది.

28దేశాలకుగాను 17 దేశాల్లో మీడియా పట్ల విశ్వాసం తగ్గింది. మీడియా పట్ల విశ్వాసం కోల్పోయిన దేశాల్లో భారత్‌ కూడా ఉంది. అయినా ఈ దేశాల ప్రజలు ఇప్పటికీ మీడియాను ఉన్నతమైన వ్యవస్థగానే పరిగణిస్తున్నారు.

మరిన్ని వార్తలు