రావణ కాష్టాన్ని ఆర్పండి: సీపీఎం

14 Nov, 2013 02:55 IST|Sakshi
రావణ కాష్టాన్ని ఆర్పండి: సీపీఎం

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘రాష్ట్రం రావణకాష్ఠంలా మారింది. దీన్నిలా తగలబడనివ్వొద్దు. వెంటనే పరిష్కారం చూపాలి. విభజన వల్ల పరిష్కారమయ్యే సమస్యలకన్నా ఉత్పన్నమయ్యేవే చాలా ఎక్కువ. కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి’’ అని కేంద్ర మంత్రుల బృందాన్ని సీపీఎం కోరింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డిలతో కూడిన బృందం బుధవారం ఉదయం జీవోఎం సభ్యులతో భేటీ అయింది.

అనంతరం రంగారెడ్డితో కలిసి రాఘవులు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, మంత్రులు జైరాం రమేశ్, వీరప్ప మొయిలీలకు తమ అభిప్రాయాన్ని రాతపూర్వకంగా ఇవ్వడంతో పాటు వివరించామన్నారు. ‘‘నాలుగేళ్లుగా సమస్యను నానబెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పాలన స్తంభించింది. మంత్రివర్గం రెండు ముఠాలై యుద్ధ శిబిరాల్లా నడుస్తోంది. ప్రజా సమస్యలు పేరుకుపోయాయి. వాటిని పరిష్కరించే నాథుడు కనబడటం లేదు. అభివృద్ధి కుంటుపడింది. ఇంకా మీరు ఈ సమస్యని సాగదీసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుంటే ప్రజలు క్షమించరని జీవోఎంకు చెప్పాం. ఏదో ఒక నిర్ణయం చెబుతామని గతంలో చెప్పి కూడా వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈసారైనా నాటకాలు కట్టిపెట్టి పరిష్కారం చూపుతారా లేదా అని నిలదీశాం’’ అన్నారు.

రెండే అడిగారు...
పోలవరం, భద్రాచలం డివిజన్‌ను విడదీయడంపై జీవోఎం తమను అభిప్రాయం కోరిందని రాఘవులు వెల్లడించారు. ‘ప్రస్తుత డిజైన్‌లో పోలవరం ప్రాజెక్టు గిరిజనులను, విలువైన భూముల్ని ముంచేస్తుంది. కాబట్టి డిజైన్ మార్చాలన్నాం. ఇక రాష్ట్రాన్నే విడదీయొద్దని మేమంటున్నప్పుడు ఖమ్మం జిల్లాను విడదీయాలని కోరబోమని చెప్పాం. జీవోఎం ముందు నాలుగు ప్రధాన సమస్యల్ని లేవనెత్తాం. సమైక్యంగా ఉన్నా, విభజించినా వెనకబడిన ప్రాంతాలు, జిల్లాల సమస్య ముఖ్యమైనది. అందుకే సమైక్య రాష్ట్రంలో కూడా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిర్దిష్ట సూచనలు చేశాం. వాటిని జీవోఎం సభ్యులు సావధానంగా విన్నారు’ అని చెప్పారు. "

సీపీఎం లేవనెత్తిన నాలుగు అంశాలు...
1.    సాగునీటి సౌకర్యాలకు సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు ప్రాతిపదికగా అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, మహబూబ్‌నగర్, నల్లగొండ, ప్రకాశం జిల్లాలకు వర్తించే ప్రాజెక్టుల పరిపూర్తికి అయ్యే ఖర్చునంతా కేంద్రం భరించాలి. తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల, కంతనపల్లిలను కేంద్ర నిధులతో పూర్తి చేయాలి. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులనూ త్వరగా పూర్తి చేయాలి.

2.    సామాజిక తరగతులు, దళితులు, ముస్లింలు, గిరిజనుల వెనకబాటే పలు ప్రాంతాల వెనకబాటుతనానికి ముఖ్య కారణం. వారి అభ్యున్నతికి, విద్యాపరంగా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

3.    చిత్తూరు నుంచి ఆదిలాబాద్ దాకా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న పశ్చిమ ప్రాంత మండలాల్లో ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల్ని అదనంగా ఏర్పాటు చేయాలి.

4.    కోస్తా తీరంలో ఓడరేవులకు పనికొచ్చే కేంద్రాలెన్నో ఉన్నా ఇప్పటికీ అభివృద్ధి చెందలేదు. వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలి. రాయలసీమలో కూడా అన్ని సదుపాయాలతో ఒకట్రెండు ప్రాంతాల్లో పారిశ్రామికంగా, విద్యాపరంగా, సేవాపరంగా అభివృద్ధికి ప్రభుత్వరంగంలో కాంప్లెక్సుల స్థాపనకు చర్యలు తీసుకోవాలి

 జీవోఎంకు సీపీఎం బృందం సమర్పించిన నాలుగుపేజీల వినతిపత్రంలోని ఇతర ముఖ్యాంశాలివి...
కృష్ణా జలాల పంపిణీపై బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు రాష్ట్రానికి సరైన న్యాయం చేయలేదు. అందుకే న్యాయమైన పద్ధతిలో రాష్ట్రానికి అదనపు నికర జలాలను కేటాయించేలా ఎగువ రాష్ట్రాలతో కేంద్రం ఒప్పందాలు కుదర్చాలి
  

అక్షరాస్యతలో బాగా వెనకబడిన ప్రతి మండలంలోనూ కనీసం రెండు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టాలి. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో విద్యా కాంప్లెక్సులు ఏర్పాటు చేయాలి

హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, పరిశోధనా సంస్థలన్నింటినీ అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలి

ముస్లిం ప్రాబల్య పట్టణాల్లో వారికోసం ఆధునిక, లౌకిక విద్యనందించే విద్యా కాంప్లెక్సులు నెలకొల్పాలి

అభివృద్ధిని ఉత్తర తెలంగాణ, రాయలసీమల్లోని పలు జిల్లాలకు వికేంద్రీకరించాలి. ఆయా కేంద్రాలను మార్కెట్లతో సంధానిస్తూ ఆధునిక రవాణా మార్గాలు నిర్మించాలి

రాష్ట్రంలోని గ్యాస్, బొగ్గు ఉత్పత్తుల్లో రాష్ట్ర అవసరాలకు ప్రాధాన్యమిస్తూ కేటాయింపులను కేంద్రం తిరిగి నిర్ణయించాలి

మరిన్ని వార్తలు