గోవాలో ఏం జరిగిందో తెలుసా?

14 Mar, 2017 15:14 IST|Sakshi
(విజయ్ సర్దేశాయ్)

రాజకీయాల్లో శషభిషలు పనికిరావన్న విషయం గోవాలో మరోసారి రుజువైంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువున్నా, వాళ్లు అవకాశాలను ఉపయోగించుకోలేకపోయారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలున్నాయి. అంటే మేజిక్ మార్కు 21. కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు వచ్చాయి. బీజేపీ 14 చోట్ల గెలిచింది. అయితే.. రెండు చిన్న ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవడంలో బీజేపీ జెట్ స్పీడుతో వ్యవహరించింది. అవి.. గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ. ఈ రెండింటికీ మూడేసి చొప్పున స్థానాలు వచ్చాయి. దాంతో ఇద్దరు స్వతంత్రులతో కలిసి వీళ్ల మద్దతు కూడా తీసుకుని బీజేపీ తనకు కావల్సిన మెజారిటీని సంపాదించేసుకుంది. ఎన్నికలకు ముందున్న బీజేపీ ప్రభుత్వంలో తొలుత మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఉండేది. కానీ విజయ్ సర్దేశాయ్ నేతృత్వంలోని గోవా ఫార్వర్డ్ పార్టీ మాత్రం.. బహిరంగంగా బీజేపీని విమర్శించేది. మనోహర్ పరీకర్‌ను కూడా పొలిటికల్ ఫిక్సర్ అని వ్యాఖ్యానించేది. అయితే.. అదే సర్దేశాయ్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రధాన పాత్ర పోషించారు.

ఎవరేం చేశారంటే...
శనివారం మధ్యాహ్నానికి ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆదివారం సాయంత్రం మనోహర్ పరీకర్, నితిన్ గడ్కరీ ఇద్దరూ గోవాలోని ఒక ఫైవ్‌ స్టార్ హోటల్లో కూర్చుని తీవ్రంగా మధనపడుతున్నారు. ఎంజీపీ మద్దతిచ్చేందుకు ముందుకొచ్చినా, జీఎఫ్‌పీ మాత్రం ఇంకా సరేనని చెప్పలేదు. సరిగ్గా అలాంటి సమయంలోనే విజయ్ సర్దేశాయ్ అక్కడకు వచ్చారు. అంతే ఒక్కసారిగా బీజేపీ బలం 19 నుంచి 22కు పెరిగిపోయింది. సరిగ్గా అదే సమయానికి అదే గోవాలోని మరో ఫైవ్ స్టార్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమై.. ముఖ్యమంత్రిగా ఎవరిని చేస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారు. అప్పటికే ఒకసారి జీఎఫ్‌పీ వాళ్లకు మద్దతిస్తామని ఆఫర్ చేసినా, నెమ్మదిగా చూసుకోవచ్చులేనని ఆగిపోయారు తప్ప సరిగా స్పందించలేదు. సరిగ్గా ఇదే వాళ్ల కొంప ముంచింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఐదుగురి పేర్లను అనుకున్నా, ప్రతి ఒక్కరికీ అవతలి వర్గం నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. సాయంత్రానికి కాంగ్రెస్ నేతలు హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాన్ని ఢిల్లీ నేతలు సర్వనాశనం చేస్తున్నారని ఎమ్మెల్యే జెన్నిఫర్ మాన్సెరాటె మండిపడ్డారు.

ఈ విషయం తెలియగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బీజేపీ నేతలు గవర్నర్ మృదులా సిన్హా వద్దకు వెళ్లిపోయి.. తమకు 22 మంది మద్దతు ఉందని, అందువల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాంతో అప్పుడు ఆలస్యంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రకాంత్ కవ్లేకర్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పింది. కానీ అప్పటికే జరగాల్సింది అంతా జరిగిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం పోయేందుకు తనదే బాధ్యత అని దిగ్విజయ్ సింగ్ భారంగా చెప్పారు. స్వతంత్ర సభ్యులిద్దరూ తమ పార్టీని మోసం చేశారని ఆయన ఆరోపించారు.

ముందు రోజు ఏమైంది?
శనివారం రాత్రి ఫలితాలు వెలువడిన తర్వాత జీఎఫ్‌పీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ స్వయంగా వెళ్లి దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని తెలిపారు. అయితే కామత్‌ను ముఖ్యమంత్రి చేయాలని షరతు పెట్టారు. దానికి దిగ్విజయ్ ఏమీ చెప్పలేదు. అలాగే సర్దేశాయ్ వచ్చిన విషయాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా చెప్పలేదు. ఈలోపు శనివారం రాత్రి గడ్కరీ గోవా వచ్చారు. వెంటనే ఎంజీపీ నేతలతో గంటలకొద్దీ మంతనాలు జరిపారు. వాళ్లు బీజేపీకి మద్దతిచ్చేందుకు సరేనన్నారు. తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ చర్చలు జరిగాయి. ఆ తర్వాత గడ్కరీ.. విజయ్ సర్దేశాయ్‌ని కలిశారు. కానీ అప్పటికి ఏమీ ఫలితం రాలేదు. ఆదివారం మధ్యాహ్నం సర్దేశాయ్ వద్దకు గడ్కరీ తన దూతను పంపి, ఆయన్ను మళ్లీ హోటల్‌కు తీసుకొచ్చారు. అక్కడ డీల్ కుదిరింది. కేబినెట్‌లో మూడు పదవులు ఇస్తామని ఆయనకు హామీ లభించడంతో విజయ్ సర్దేశాయ్ సరేనన్నారు. పరీకర్‌కు అద్భుతమైన పాలనా నైపుణ్యాలు ఉన్నాయని ప్రశంసించారు. అంతే, గోవాలో బీజేపీ ప్రభుత్వానికి బాటలు పడ్డాయి.

మరిన్ని వార్తలు