కాకి లెక్కలొద్దు బాబూ! : జూపూడి ప్రభాకరరావు

17 Sep, 2013 03:17 IST|Sakshi
కాకి లెక్కలొద్దు బాబూ! : జూపూడి ప్రభాకరరావు

- ఆస్తుల ప్రకటనపై జూపూడి ధ్వజం
- విజయమ్మ పిటిషన్‌పై విచారణకు సిద్ధం కావాలి
-    లోకేష్ ఆస్తులు ఎందుకు తగ్గాయి.. బినామీ ఆస్తుల మాటేమిటి?
-    రాష్ట్రం సంక్షోభంలో ఉంటే ఆస్తుల ప్రకటనేమిటంటూ ధ్వజం  

 
నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలోని చంద్రబాబు నివాసమిది. 1,125 గజాల్లో ఉన్న ఈ ఇంటి విలువ కేవలం 23.2 లక్షలేనని బాబు చెబుతున్నారు. 2007లోనే ఆయన ఇంటికి సమీపంలో ఉన్న  ప్రభుత్వ భూమిని వేలం వేసినప్పుడు ఐసీఐసీఐ కన్సార్షియం గజం రూ. లక్ష చొప్పున కొనుగోలు చేసింది. ఈ లెక్కన చంద్రబాబు ఇంటి విలువ ఎంత ఉంటుందో తేలికగా అంచనా వేయొచ్చు. ఈ ఉదాహరణ చూస్తే చాలదా.. బాబు ఆస్తి లెక్కలన్నీ.. ఎంతటి కాకి లెక్కలో!

సాక్షి, హైదరాబాద్: ఆస్తుల ప్రకటన పేరుతో కాకి లెక్కలు చెప్పొద్దని చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు జూపూడి ప్రభాకరరావు హితవు పలికారు. బాబుకు ఏ మాత్రం నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నా ఆయన ఆస్తులకు సంబంధించి గతంలో వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్‌లోని అంశాలపై విచారణకు సిద్ధపడాలని సవాలు విసిరారు. ఆస్తుల వెల్లడి పేరుతో సోమవారం చంద్రబాబు చేసిన ప్రకటనను సోమవారం జూపూడి విలేకరుల సమావేశంలో దుయ్యబట్టారు. ‘‘బాబు ప్రకటించిన ఆస్తుల వివరాలన్నీ తప్పుల తడకే. అవే గనక నిజమని ఆయన భావిస్తే గతంలో విజయమ్మ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఎందుకు గందరగోళపడిపోయారు? మూడు చెరువుల నీళ్లు తాగిన విధంగా హడావుడి పడి, కేసులు లేకుండా ఎందుకు చేసుకున్నారు?’’ అని ప్రశ్నించారు.
 
 ‘మీరు నిజంగా అవినీతిపై యుద్ధం చేయదల్చుకుంటే తొలుత మీపై విజయమ్మ వేసిన పిటిషన్‌ను తిరగదోడాలని చెప్పి విచారణకు ముందుకు రండి, ఐఎంజీ భూముల కేటాయింపు, ఎమ్మార్ ఉదంతంలో మీరు పాల్పడిన కుంభకోణాలను వెలికి తీయాలని కోరండి’ అన్నారు. రాష్ట్రం నిలువునా చీలిపోతుందేమోనన్న ఆందోళనతో ఒకవైపు సంక్షోభం నెలకొన్న తరుణంలో, మెడమీద కత్తిలాగా ఢిల్లీ కుట్రలకు రాష్ట్ర ప్రజలు బలవుతూ ఉంటే... బాబు మాత్రం వాటి గురించి మాట్లాడకుండా ‘నేను ఆస్తులు ప్రకటించాను. మీరూ ఆస్తులు ప్రకటించండి’ అనడం విడ్డూరమంటూ ధ్వజమెత్తారు. బాబు అవినీతిపరుడు కాకపోతే ఆయనపై 2,421 పేజీలతో విజయమ్మ వేసిన పిటిషన్‌పై కోర్టు ఆదేశించిన విచారణను ఎందుకు అడ్డుకున్నార ని ప్రశ్నించారు.
 
 జనం నమ్ముతారనుకోవడం బాబు భ్రమ
 బాబు తన బినామీ ఆస్తులను ప్రకటించకుండా తన భార్య, కుమారుడు, తాత ముత్తాతల వివరాలనే ప్రకటించారని జూపూడి అన్నారు. గతేడాదితో పోలిస్తే బాబు, ఆయన భార్య, కోడలి ఆస్తులు పెరిగినా... కేవలం కుమారుడు లోకేశ్ ఆస్తులే ఎందుకు తగ్గాయో వివరణ ఇవ్వలేదన్నారు. ‘‘ఎందుకిలా తగ్గాయి? ఇదేమైనా స్టాక్ మార్కెటా? లేక మీ కుమారుడికి వ్యాపారం చేతకాక నష్టాల్లో పడిపోయారా?’ అని ప్రశ్నించారు. బాబు బినామీ ఆస్తులు, వ్యాపారాలు, సింగపూర్ వ్యవహారాలు, లోకేశ్ చదువు, వెలగబెట్టిన డి గ్రీలు, సత్యం రామలింగరాజు వ్యవహారం... ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. ఆస్తులు ప్రకటిస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం బాబు భ్రమేనన్నారు.
 
  ‘‘రాష్ట్రం నిలువునా చీలి రెండు ప్రాంతాలు ఉద్యమాల్లో ఉంటే ఏం చేయాలో అర్థం కాక, అనుమానిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పలేక బస్సు యాత్ర నుంచి పారిపోయి తిరిగొచ్చిన బాబుకు హఠాత్తుగా ఆస్తుల వెల్లడి వ్యవహారం గుర్తుకొచ్చింది! సమయం, సందర్భం లేకుండా, ప్రజలకు జ్ఞాపకశక్తి ఉండదని భావించి ఆస్తులు ప్రకటించారు. రాష్ట్రం విడిపోవద్దంటూ ఓవైపు ప్రజలు గగ్గోలు పెడుతూన్నా వారేం భావిస్తున్నారో తెలుసుకోకుండా బాబు వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన తీరు రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా ఉంది. ఆస్తుల ప్రకటన చేస్తే పోయిన ప్రాభవం తిరిగి వస్తుందన్న బాబు ఆశలు నెరవేరబోవన్నారు. ‘నేతలు తమ ఆస్తులు ప్రకటిస్తే దేశంలో అవినీతి తగ్గి పోతుందా? ఇదెక్కడి కొత్త సిద్ధాంతం?’ అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు