కనీస పెన్షన్ రూ.1000

6 Feb, 2014 04:53 IST|Sakshi
కనీస పెన్షన్ రూ.1000

న్యూఢిల్లీ: అర్హులైన పెన్షన్‌దారులకు నెలవారీ కనీస పెన్షన్‌గా రూ.1,000 ఇవ్వాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) నిర్ణయించింది. ఈపీఎఫ్‌ఓలోని అత్యున్నత నిర్ణయ విభాగమైన ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ)’ బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. అనంతరం సీబీటీ భేటీకి అధ్యక్షత వహించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కింది వివరాలను వెల్లడించారు.
     ఉద్యోగస్తుల పెన్షన్ పథకం(ఈపీఎస్-95) కింద కనీసం రూ. 1000 పెన్షన్‌గా ఇవ్వడం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
     దీనివల్ల 5 లక్షల మంది భర్తను కోల్పోయిన మహిళలు సహా దాదాపు 28 లక్షల పెన్షన్‌దారులు తక్షణం లబ్ధి పొందుతారు. ఈపీఎస్ కింద ఉన్న మొత్తం పెన్షన్‌దారుల సంఖ్య 44 లక్షలు.
     ఇందుకోసం ప్రభుత్వం రూ.1,217 కోట్లను అదనంగా సమకూర్చాల్సి ఉంది.
     ఈపీఎఫ్‌ఓ చందాదారులు.. వయస్సు 58 ఏళ్లు దాటగానే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
     పెన్షన్‌కు అర్హమైన వేతనాన్ని గణించే పద్ధతిని కూడా మార్చారు. గతంలో 12 నెలల సగటు వేతనం ఆధారంగా గణించగా, ఇకనుంచి 60 నెలల సగటు వేతనం ఆధారంగా లెక్కిస్తారు.
     ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) పథకం కింద వేతన పరిమితినిరూ.6,500(మూలవేతనం, డీఏ కలిపి) నుంచి రూ.15 వేలకు పెంచాలని కూడా సీబీటీ నిర్ణయించింది. దీంతో మరో 50 లక్షల మంది ఈపీఎఫ్‌ఓ సామాజిక భద్రత పథకాల్లో చేరేందుకు అర్హులవుతారు. దీన్ని సీబీటీలోని కార్మిక సంఘాల ప్రతినిధులు వ్యతిరేకించారు.
     డీఏతో కూడిన మూల వేతనంపై 1.1 శాతం ఉన్న అడ్మినిస్ట్రేటివ్ చార్జీలను 0.85కి తగ్గించా రు. ఈ చార్జీలను యాజమాన్యం చెల్లించాలి.
 కేంద్రం నిధులను సమకూర్చాల్సి ఉన్నందున కార్మిక మంత్రిత్వ శాఖ త్వరలో ఈ ప్రతిపాదనను కేబినెట్ ముందు ఉంచుతారని ఈపీఎఫ్‌ఓ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు