కోహ్లి అహంభావమే కారణం..!

21 Jun, 2017 15:20 IST|Sakshi
కోహ్లి అహంభావమే కారణం..!

ఏడాదిపాటు భారత క్రికెట్‌ జట్టుకు అద్భుతమైన సేవలు అందించినప్పటికీ అర్ధంతరంగా కోచ్‌ పదవి నుంచి క్రికెట్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే తప్పుకున్నాడు. కుంబ్లే కోచ్‌గా ఉన్న కాలంలో భారత్‌ ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. స్వదేశంలో ఆడిన టెస్టుల్లో ఒక్కదాంట్లో మాత్రమే ఏడి.. ఏకంగా 12 టెస్టుల్లో గెలుపొంది.. గొప్ప రికార్డులను సాధించింది. కుంబ్లే హయాంలో భారత్‌ ఒక్క టీ-20 సిరీస్‌ను మాత్రమే వెస్టిండీస్‌ చేతిలో ఓడిపోయింది. కుంబ్లే పర్యవేక్షణలోనే చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ వరకు టీమిండియా చేరింది. ఒక ఆటగాడిగా ఎంత నిబద్ధత ప్రదర్శించాడో.. ఒక కోచ్‌గా కూడా అనిల్‌ కుంబ్లే అంతే క్రమశిక్షణతో మెలిగాడని సన్నిహితులు చెప్తున్నారు.

కోచ్‌గా కొనసాగేందుకు రెండువారాల పొడిగింపు కుంబ్లేకు ఇచ్చినా.. దానిని ఆయన తిరస్కరించి రాజీనామా చేశాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక కుంబ్లే కూడా స్పందిస్తూ తన పనితీరుపై కెప్టెన్‌ కోహ్లికి అభ్యంతరాలు ఉన్నాయని, అందుకే తనతో భాగస్వామ్యాన్ని కోహ్లి ఇక​ ఎంతమాత్రం కొనసాగించలేని పరిస్థితిలో ఉండటంతో తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. కోచ్‌-కెప్టెన్‌కు మధ్య సరిహద్దులను తాను ఎప్పుడూ గౌరవించానని, ఆయన తన పాత్ర అతనికి నచ్చకపోవడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. మరోవైపు మనస్తాపంతో అర్ధంతరంగా తప్పుకున్న కుంబ్లేకు సోషల్‌ మీడియాలో అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. ఆయన సేవలను కీర్తిస్తూ.. వీడ్కోలు పలుకుతున్నారు. కేవలం కెప్టెన్‌ కోహ్లి అహంకారం, అహంభావం వల్లే క్రీడా దిగ్గజమైన కోహ్లి తప్పుకోవాల్సి వచ్చిందని, భారత్‌ క్రికెట్‌కు కోహ్లి సర్వస్వమా అని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు