పండుగ అమ్మకాలు బాగున్నాయ్..

12 Oct, 2013 01:41 IST|Sakshi
పండుగ అమ్మకాలు బాగున్నాయ్..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగ సీజన్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో నమోదు అవుతుండడంతో ఎలక్ట్రానిక్, గృహోపకరణాల తయారీ కంపెనీలు ఆనందంలో ఉన్నాయి. ఓనమ్ పండుగ సందర్భంగా జరిగిన అమ్మకాలతో కంపెనీల ఆశలు రెట్టింపయ్యాయి. రానున్న పండుగలకు కూడా ఇదే జోష్ ఉంటుందని విశ్వసిస్తున్నాయి. దీనికితోడు వినియోగ వస్తువుల కొనుగోళ్ల కోసం ఇచ్చే రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడం పరిశ్రమ పెద్ద ఊరటగా భావిస్తోంది. సీజన్‌ను మరింత రంగుల మయం చేసేందుకు కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఇక టీఎంసీ, ఆదీశ్వర్, బజాజ్, సోనోవిజన్ వంటి విక్రయ సంస్థలు ప్రకటించిన భారీ ఆఫర్లు కస్టమర్లను ఇట్టే ఆకర్శిస్తున్నాయి.
 
 అమ్మకాలు ఓకే..
 పండుగల సీజన్‌లో తాము 17-18 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు ఒనిడా బ్రాండ్‌తో ఉపకరణాలను విక్రయిస్తున్న మిర్క్ ఎలక్ట్రానిక్స్ సీఎండీ జీఎల్ మిర్‌చందానీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రూపాయి పతనం కారణంగా ఉపకరణాల ధర పెరగడం, ఈఎంఐలు తగ్గకపోవడం కొంచెం ఇబ్బందికర పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకుల కొత్త వడ్డీ రేట్ల ప్రభావం రానున్న రోజుల్లో అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేస్తుందని అన్నారు. గతేడాది గృహోపకరణాల అమ్మకాలు ఎక్కువగా ఉంటే, ఈ ఏడాది ఎల్‌ఈడీ, 3డీ టీవీలకు డిమాండ్ ఉందని ప్యానాసోనిక్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ మేనేజర్ బొమ్మారెడ్డి ప్రసాదరెడ్డి అన్నారు. సీజన్‌లో 12-15 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు తెలిపారు.
 
 ఓనమ్ ఊపుతో..
 ఓనమ్ పండుగ సందర్భంగా శాంసంగ్, సోని, ప్యానాసోనిక్, ఎల్‌జి తదితర కంపెనీలు రెండంకెల వృద్ధి నమోదు చేశాయి. వినాయక చవితి సమయంలోనూ మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఉపకరణాల విక్రయ దుకాణాలు కిటకిటలాడాయి. ఓనమ్ అమ్మకాలు రూ.250 కోట్లు జరిగాయని శాంసంగ్ వెల్లడించింది. మొత్తంగా పండుగల సీజన్‌లో ఎలక్ట్రానిక్స్ ద్వారా రూ.3,500 కోట్ల ఆదాయం ల క్ష్యంగా చేసుకున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ జైన్ ఇటీవల తెలిపారు. సోని ఇండియా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై-సెప్టెంబరులో 34 శాతం వృద్ధితో రూ.170 కోట్ల వ్యాపారం చేసింది. ఉత్పత్తులనుబట్టి 30-47 శాతం వృద్ధి నమోదు చేసినట్టు ఎల్‌జీ తెలిపింది. అమ్మకాలు పుంజుకోవడం ఖాయమని హాయర్ అప్లయాన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా అన్నారు. ఓనమ్ సమయంలో రూ.200 కోట్ల వ్యాపారం చేశామని వివరించారు.
 
 కొత్త మోడళ్లతో..
 సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా 55, 65 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ టీవీలను బుధవారం విడుదల చేసింది. వీటి ధర రూ.3.30-4.50 లక్షలుంది. ప్యానాసోనిక్ ఆధునిక ఫీచర్లతో ఎల్‌ఈడీ, 3డీ టీవీలను అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ గత నెలలోనే 55, 65 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ టీవీలను ప్రవేశపెట్టింది. రూ.500-5000 క్యాష్‌బ్యాక్‌తోపాటు రూ.2 లక్షల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకునే అవకాశాన్ని సీమెన్స్ హోం అప్లయాన్సెస్ కల్పిస్తోంది

మరిన్ని వార్తలు