ముఖ్యమంత్రికి బాసటగా సినీ పరిశ్రమ

4 Aug, 2014 20:45 IST|Sakshi
చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న హీరో శరత్ కుమార్

ఢిల్లీ/చెన్నై : తమిళ మత్స్యకారుల సమస్యల పరిష్కారంపై ప్రధాని నరేంద్రమోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాసిన లేఖలను శ్రీలంక వెబ్‌సైట్‌లో కించపరచడంపై కోలీవుడ్ ధ్వజమెత్తింది. చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయం వద్దకు మొత్తం తమిళ సినీ పరిశ్రమ కదలి వచ్చి జయలలితకు బాసటగా నిలిచింది. తమిళ నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్‌ల నాయకత్వంలో 24 విభాగాలకు చెందిన వారంతా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు.

నటీ నటులు శివకుమార్, సూర్య, విజయ్, భాగ్యరాజ్, వివేక్ సహా వందలాది మంది సినీ ప్రముఖులు, పలువురు నటీమణులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాయబార కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నాన్ని కూడా పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. శ్రీలంక వ్యవహారాన్ని ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా పరిగణించాలని కోరారు.

ఇదిలాఉండగా,  శ్రీలంక వెబ్‌సైట్‌లో జయలలితపై రాసిన అభ్యంతరకర వ్యాసంపై పార్లమెంటులో దుమారంలేచింది. నేతలు ముక్తకంఠంతో ఖండించారు. లంక దౌత్యవేత్తకు సమన్లు పంపి నిరసన వ్యక్తం చేయనున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.

మరిన్ని వార్తలు