భగ్గుమన్న సినీలోకం.. దిగ్భ్రాంతి, విషాదం

20 Feb, 2017 11:23 IST|Sakshi
భగ్గుమన్న సినీలోకం.. దిగ్భ్రాంతి, విషాదం

కొచ్చిలోని దర్బార్‌ హాల్‌లో ఆదివారం గంభీరమైన విషాద వాతావరణం నెలకొంది. మలయాళీ సినీ ప్రముఖుల ముఖాల్లో ఆవేదన, దిగ్భ్రాంతి కనిపించాయి. తమ స్నేహితురాలు, తమకు తెలిసిన ఒక మంచి నటి శుక్రవారం రాత్రి అపహరణకు గురై.. లైంగిక వేధింపుల బారిన పడటం.. సినీ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. బాధితురాలైన ఆ నటికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం దర్బార్‌ హాల్‌లో మలీవుడ్‌ నటులు, రాజకీయ నాయకులు, ప్రజలు ఒకచోట గుమిగూడారు. ఏదిఏమైనా బాధితురాలైన సినీనటికి న్యాయం చేసేవరకు అండగా ఉంటామని, ఆమెకు మద్దతుగా నిలబడతామని ప్రతిన బూనారు.

ఈ సందర్భంగా ప్రముఖ నటి మంజూ వరీర్‌ మాట్లాడుతూ 'ఈ నేరం వెనుక క్రిమినల్‌ కుట్ర ఉన్నట్టు స్పష్టమవుతున్నది. మనం ఇప్పుడు చేయాల్సింది తనకు అండగా నిలబడి.. దోషులకు శిక్ష పడేలా చేయడమే. మహిళలకు గౌరవం దక్కాలి. ఇంట్లో అయినా బయట అయినా వారిని గౌరవంగా చూడాలి' అని ఆమె పేర్కొన్నారు. కఠినమైన పరిస్థితులు ఎదురైనా.. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడిన బాధితురాలి ధైర్యాన్ని ఆమె కొనియాడారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే రేప్‌, నేరపూరిత కుట్ర, కిడ్నాప్‌ అభియోగాలు నమోదుచేసిన సంగతి తెలిసిందే.

మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్మూటి మాట్లాడుతూ బాధితురాలైన నటి ఎంతోమందికి ఆప్తురాలు అని, ఆమెకు ప్రతి ఒక్కరి మద్దతు ఉందని, ప్రజలు, సినీ ప్రముఖులు, పోలీసులు,ప్రభుత్వం అందరూ ఆమె వైపే నిలబడ్డారని పేర్కొన్నారు. ఆమెకు తాను కూడా అండగా ఉంటానని, ఆమె ధైర్యంగా నిలబడాలని ఆయన సూచించారు. యువ హీరో దుల్కర్‌ సల్మాన్‌ స్పందిస్తూ జరిగిన ఘటన తనను కలిచివేసిందని, భయాందోళనకు గురిచేసిందని పేర్కొన్నారు. మన సమాజంలో మహిళలను గౌరవంగా చూస్తారని తాను గర్వపడేవాడినని, కానీ ఘటనతో ఆ గర్వం ఛిన్నాభిన్నమైందని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు